Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఓ సినిమా మంచి విజయం సాధించినప్పటికీ దాని సీక్వెల్ తీయడానికి మేకర్స్ బాగా ఆలోచిస్తారు. అన్ని కుదిరితే తప్ప సీక్వెల్‌ని ఎనౌన్స్ చేయరు. ఇక సిరీస్‌ల గురించి వేరే చెప్పక్కర్లేదు. మెస్మరైజ్ చేసే కథాకథనం, ఉత్కంఠ రేకెత్తించే కొనసాగింపు ఉంటేనే తప్ప సిరీస్‌లు వర్కవుట్ కావు. పైగా స్టార్ హీరోలతో సిరీస్‌లంటే, అదే స్థాయిలో రిస్కూ ఉంటుంది. రిస్క్ ఉన్నప్పటికీ అటు మేకర్స్, ఇటు స్టార్ హీరోలు తగ్గేదే..లే అంటున్నారు. సిరీస్ పంథాతోనూ హిట్లు కొట్టాల్సిందేనని రంగంలోకి దిగుతున్నారు.
ఈ నేపథ్యంలో సర్వత్రా క్యూరియాసిటీని రైజ్ చేస్తున్న పలువురు స్టార్ల సిరీస్‌లపై ఓ లుక్కేద్దాం..
మోహన్‌లాల్ - దృశ్యం 3
మలయాళ చిత్ర పరిశ్రమ సత్తాని చాటిన చిత్రం 'దృశ్యం' (2013). మోహన్‌లాల్ నటించిన ఈ సినిమా అందరినీ థ్రిల్ చేసింది. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళం, సింహళ (శ్రీలంక) భాషల్లోనూ రీమేకై అఖండ విజయమూ సాధించింది. అంతేకాదు చైనాలోనూ ఈ సినిమా 'షీప్ విత్ అవుట్ షీప్యార్డ్'గా రీమేకై విశేష ఆదరణ పొందింది. చైనాలో రీమేక్ అయిన తొలి సినిమా ఇదే కావడం విశేషం. అలాగే దీనికి సీక్వెల్‌గా విడుదలైన 'దృశ్యం 2' (2021) సైతం మంచి విజయం సాధించింది. మోహన్‌లాల్, జీతూ జోసెఫ్ కాంబినేషన్లో రూపొందిన ఈ రెండు చిత్రాలకు కొనసాగింపుగా 'దృశ్యం 3' త్వరలోనే పట్టాలెక్కబోతోంది. ఇటీవల దీనికి సంబంధించిన కథా చర్చలు కూడా పూర్తయ్యాయని వినిపిస్తోంది.
తెలుగు 'దృశ్యం'లో వెంకటేష్ నటించిన విషయం తెలిసిందే. శ్రీప్రియ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి వసూళ్ళని రాబట్టింది. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా 'దృశ్యం 2'లోనూ వెంకటేష్ నటిస్తున్నారు. జీతూ జోసెఫ్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు.
ఇదిలా ఉంటే, 'దృశ్యం 2' చిత్రాన్ని బాలీవుడ్‌లోనూ రీమేక్ చేయబోతున్నారు. ఇందులోనూ అజరు దేవగన్ నటించబోతున్నారు. తమిళంలో తెరకెక్కబోయే రీమేక్‌కి కూడా జీతూ జోసెఫే దర్శకత్వం వహించనుండటం విశేషం. ఇక కన్నడలో కూడా పి.వాసు డైరెక్షన్లోనే 'దృశ్యం 2' రీమేక్ అవుతోంది. ఓ పక్క 'దృశ్యం 2' సినిమా పలు భాషల్లో రీమేక్ అవుతుండగానే, 'దృశ్యం 3'కి రంగం సిద్ధమవ్వడం సర్ప్రైజ్.
సూర్య - సింగం 4
తమిళ స్టార్ హీరో సూర్య నటించిన 'సింగం' సిరీస్‌లో భాగంగా వచ్చిన 'సింగం', 'సింగం 2', 'సింగం 3' చిత్రాలు బ్లాక్‌బస్టర్స్‌గా కలెక్షన్ల సునామీ సృష్టించాయి. పవర్పోలీస్కి ప్రతీకగా కథానాయకుడు సూర్యను దర్శకుడు హరి చూపించిన విధానానికి అందరూ ఫిదా అయిపోయారు. దీంతో ఒక్క తమిళనాటే కాదు యావత్ భారతదేశంలోనూ సూర్య, హరి కాంబినేషన్‌కి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. హిందీ, కన్నడ, బెంగాలీ, పంజాబీ భాషల్లో 'సింగం' సినిమా రీమేకై అందర్నీ అలరించింది. ఇక తెలుగులో కూడా అనువాద చిత్రంగా విడుదలై సంచలన విజయం సాధించింది. సూర్య, అనుష్క జంటగా రూపొందిన ఈ సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్‌ని షేక్ చేసింది.
అలాగే 'సింగం 2' సైతం తెలుగులో 'యముడు', హిందీలో 'మై హూ సూర్య : సింగం 2' టైటిల్స్‌తో విడుదలై హిట్ కొట్టాయి. 'సింగం 2' సీక్వెల్‌గా నిర్మితమైన 'ఎస్3' ( సింగం 3), తెలుగులో 'యముడు 3'గా విడుదలై ఆకట్టుకున్నాయి. ఇంతగా ఆదరణ పొందిన 'సింగం' సిరీస్‌కి కొనసాగింపుగా 'సింగం 4' పట్టాలెక్కనుంది. ఆగస్టు నుంచి చిత్రీకరణను స్టార్ట్ చేసే యోచనలో మేకర్స్ ఉన్నారని సమాచారం.
సల్మాన్‌ఖాన్ - టైగర్ 3
బాలీవుడ్లో అత్యంత ఆదరణ పొందిన సిరీస్ సల్మాన్‌ఖాన్ 'టైగర్' సిరీస్. సల్మాన్‌ఖాన్, కబీర్‌ఖాన్ కాంబినేషన్లో యాక్షన్ థ్రిల్లర్‌గా వచ్చిన 'ఏక్ థా టైగర్' సినిమా సంచలన విజయం సాధించింది. భారత స్పైగా సల్మాన్, పాకిస్తాన్ స్పైగా కత్రినాకైఫ్ నటన, యాక్షన్ సీక్వెన్స్‌లకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
దీనికి సీక్వెల్‌గా వచ్చిన 'టైగర్ జిందా హై' కూడా బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది. ఈ సినిమాలోనూ సల్మాన్, కత్రినా జంట అందర్నీ మెస్మరైజ్ చేసింది. సల్మాన్, అలీ అబ్బాస్ జాఫర్ కాంబోలో రూపొందిన ఈ చిత్రానికి సీక్వెల్‌గా 'టైగర్ 3' (వర్కింగ్ టైటిల్) రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ ఆరంభమైంది. సల్మాన్, కత్రినా జోడీనే నటిస్తున్న ఈ చిత్రానికి మనీష్ శర్మ దర్శకుడు. దాదాపు 250 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్ఐ ఏజెంట్‌గా ఇమ్రాన్ హష్మీ కనిపించనున్నారు.
యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రీతమ్ సంగీతం అందిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ సిరీస్‌గా 'టైగర్' సిరీస్‌కి విపరీతమైన క్రేజ్ ఉండటంతో రాబోయే 'టైగర్ 3' సినిమాపై ఇప్పటికే అందరీలోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి.