Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నూతన హీరో రామ్ అగ్నివేశ్ నటిస్తున్న చిత్రం 'ఇక్షు'. పద్మజ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై హనుమంతరావు నాయుడు, డాక్టర్ గౌతమ్ నాయుడు సమర్పణలో డాక్టర్ అశ్విని నాయుడు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రుషిక దర్శకురాలు. 'దాన వీర శూర కర్ణ' సినిమాలో నందమూరి తారక రామారావు చెప్పిన 'పాంచాలీ పంచ భద్రుకా' పాపులర్ డైలాగ్‌ని ఈ చిత్రంలోని హీరో వినిపించే సన్నివేశం ఒకటుంది. శుక్రవారం ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఈ డైలాగ్ టీజర్‌ని, పోస్టర్ని కథానాయకుడు శ్రీకాంత్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ,'దర్శక, నిర్మాతలు మంచి క్వాలిటీతో, మంచి ప్యాషన్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. నందమూరి తారక రామారావుగారు చెప్పిన భారీ డైలాగ్‌ని హీరో రామ్ అగ్నివేశ్ సింగిల్ టేక్‌లో చెప్పటం ఓ విశేషమైతే, ఆ డైలాగ్‌ని ఎన్టీఆర్ మాదిరిగానే గెటప్ వేసుకుని చెప్పటం మరో విశేషం' అని చెప్పారు. 'ఇలాంటి పరిస్థితుల్లోనూ మేం అడిగిన వెంటనే హీరో శ్రీకాంత్ మా టీజర్‌ని, పోస్టర్ని రిలీజ్ చేయటం ఆనందంగా ఉంది. ఎన్టీఆర్ డైలాగ్ వెర్షన్ చూసి హీరో రామ్ అగ్నివేశ్‌ని అభినందించారు. అలాగే మా సినిమాలో కొన్ని సన్నివేశాలు చూసి ప్రశంసించారు' అని దర్శకురాలు రుషిక తెలిపారు. హీరో రామ్ అగ్నివేశ్ మాట్లాడుతూ,'ఎన్టీఆర్ డైలాగ్ గురించి శ్రీకాంత్ గారు ఏమంటారో అని భయపడ్డాను. కానీ నేను చెప్పిన తీరు చూసి, బాగా చేశావ్ అని మెచ్చుకున్నారు' అని అన్నారు. 'శ్రీకాంత్‌గారు మా సినిమాలోని కొన్ని సన్నివేశాలను చూసి చిన్న, చిన్న కరెక్షన్స్ చెప్పారు. ఎన్టీఆర్ జయంతి సందర్బంగా ఆయన డైలాగ్ వెర్షన్ టీజర్‌ని లాంచ్ చేయటం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా గురించి మరిన్ని అప్డేట్స్ని త్వరలోనే తెలియజేస్తాం' అని నిర్మాత అశ్విని నాయుడు చెప్పారు.