Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'నటుడిగా, నాయకుడిగా ప్రజల హృదయాలపై చెరగని ముద్ర వేసిన నందమూరి తారకరామారావుకి భారతరత్న ఇస్తే తెలుగువారందరికీ ఎంతో గర్వకారణంగా ఉంటుంది' అని అగ్ర కథానాయకుడు చిరంజీవి అన్నారు. ఎన్టీఆర్ 98వ జయంతి సందర్భంగా ఆయన్ని గుర్తు చేసుకుంటూ శుక్రవారం మెగాస్టార్ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టారు.
ఎన్టీఆర్‌కి భారతరత్న ఇవ్వాలి : చిరంజీవి
'ప్రముఖ గాయకులు, నవయుగ వైతాళికులు భూపేన్ హజారికా గారికి మరణానంతరం భారతరత్న ఇచ్చినట్టు, మన తెలుగుతేజం, దేశం గర్వించే నాయకుడు నందమూరి తారకరామారావు గారికి కూడా భారతరత్న ఇస్తే, అది తెలుగు వారందరికీ గర్వ కారణం. ఆయన శతజయంతి దగ్గరపడుతున్న సందర్భంగా ఎన్టీఆర్ గారికి ఈ గౌరవం దక్కితే, అది తెలుగువారికి దక్కే గౌరవం. ఆ మహానుభావుడి 98వ జయంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ..' అని చిరు ట్వీట్లో పేర్కొన్నారు.
పాఠ్యాంశంగా రావాలి : బాలకృష్ణ
ఇదిలా ఉంటే, తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకుడు, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు జీవితచరిత్రను పాఠ్యాంశంగా తీసుకురావాలని బాలకష్ణ డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం ఉదయం హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన నివాళ్ళర్పించారు. 'ఎన్టీఆర్ యుగపురుషుడు, పేదల పెన్నిధి. మా నాన్న సినిమాలు చూసి స్ఫూర్తి పొందాను. మా నాన్నగారిపై ఎంతో మంది పుస్తకాలు రాశారు. అయితే ఆయన జీవిత చరిత్రను విద్యార్థులకు పాఠ్యాంశంగా అందుబాటులోకి తీసుకురావాలని ఎప్పటి నుంచో కోరుతున్నాను. ఇప్పటికీ దాన్నే డిమాండ్ చేస్తున్నాను' అని బాలకృష్ణ చెప్పారు.
నందమూరి తారకరామారావు జయంతిని పురస్కరించుకుని పలువురు సినీ ప్రముఖులు ఆయనతో తమకి ఉన్న అనుబంధాన్ని సోషల్ మీడియా వేదికగా గుర్తు చేసుకున్నారు. అలాగే 'మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది. మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతుంది. పెద్దమనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాతా..' అంటూ ఎన్టీఆర్ భావోద్వేగభరిత పోస్ట్‌ని షేర్ చేశారు.