Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోవిడ్ సెకండ్ వేవ్ విశృంఖుల విలయతాండవం దేశ ప్రజల జీవితాల్లో అల్లకల్లోలాన్ని సృష్టించింది. అలాగే అన్ని రంగాల్ని తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేసింది. దీంతో ఆయా రంగాల్లో పని చేస్తున్న వాళ్ళందరూ పలు సమస్యలతో సతమతమవుతున్నారు. అన్ని రంగాల మాదిరిగానే సినీ పరిశ్రమ సైతం బాగా చితికిపోయింది. ముఖ్యంగా పని చేస్తే రోజు గడవని సినీ కార్మికులు ఆకలితో అల్లాడిపోతున్నారు. ఓ పక్క కరోనాతో, మరో పక్క బతుకుబండిని లాగడం కోసం నిత్యం పోరాటం చేస్తున్నారు. వీరికి అండగా నిలబడట్టానికి సెలబ్రిటీలు ఒక్కొక్కరిగా ముందుకొస్తున్నారు. కొంత మంది ఆర్థికంగా ఆదుకుంటున్నారు. మరికొంతమంది ఆకలి తీరుస్తున్నారు. ఇంకొంత మంది నిత్యావసరాలను అందజేస్తూ చేయూతనిస్తున్నారు.
రూ.5 వేలు చొప్పున
3000 మంది సినీ కార్మికులకు సాయం : యష్
ఇందులో భాగంగా కన్నడ కథానాయకుడు యష్ భారీ మొత్తంలో ఆర్థిక సహాయం అందించి తన పెద్ద మనసుని చాటుకున్నారు. 3,000 మంది రోజువారీ సినీ కార్మికుల బ్యాంకు ఖాతాల్లో 5 వేల రూపాయలను వేయబోతున్నారు. తాను చేస్తున్న ఈ సహాయంపై యష్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
'కరోనా వైరస్ రూపంలో కనిపించని శత్రువు దేశ వ్యాప్తంగా లెక్కలేనన్ని జీవితాలను చిన్నాభిన్నం చేసింది. దీని బారిన పడిన మా కన్నడ సినిమా కుటుంబం కూడా తీవ్రంగా నష్టపోయింది. మా చిత్ర పరిశ్రమకు చెందిన 21 డిపార్టమెంట్స్కి చెందిన 3000 మంది కార్మికులకు ఆర్థిక సహాయాన్ని అందించాలని నిర్ణయించుకున్నాను. ఒక్కొక్కరి బ్యాంకు ఖాతాలో 5 వేల రూపాయల్ని వేయబోతున్నాను. ఈ చిన్న సహాయం అన్ని కష్టాలకు పరిష్కారం అని చెప్పలేను. కాని వాళ్ళందరికీ ఓ నమ్మకాన్ని, ధైర్యాన్నిస్తుంది. ప్రస్తుత తరుణంలో ఇదెంతో అవసరం' అని యష్ చెప్పారు.
ఇక యష్ నటిస్తున్న తాజా చిత్రం 'కేజీఎఫ్ 2'. ఈ చిత్ర టీజర్ ఇప్పటికే ఓ ట్రెండ్‌ని క్రియేట్ చేసింది. దాదాపు 188 మిలియన్లకి పైగా వ్యూస్‌ని సొంతం చేసుకుని సోషల్ మీడియాలో ఓ చరిత్ర సృష్టించింది. ప్రశాంత్‌నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా సినిమాపై జాతీయ, అంతర్జాతీయంగా భారీ అంచనాలు ఉన్నాయి. యష్, ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందిన 'కేజీఎఫ్' అఖండ విజయాన్ని సాధించింది. కన్నడ బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. దీంతో దీని సీక్వెల్‌గా రాబోతున్న 'కేజీఎఫ్ 2' కోసం అమితాసక్తితో ఎదురుచూస్తున్నారు.