Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'గాన గంధ్వరుడు ఎస్.పి.బాలసుబ్రమణ్యంగారు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన పాడిన అద్భుతమైన పాటల్లో ఎప్పటికీ సజీవంగానే ఉంటారు' అని సంగీత దర్శకుడు ఆర్.పి.పట్నాయక్ అన్నారు. నేడు (శుక్రవారం) ఎస్పీ బాలు 75వ జయంతి. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని యావత్ తెలుగు చిత్రసీమ ఆయనకు ఘన నివాళి అర్పించేందుకు రంగం సిద్ధం చేసింది. నేటి (శుక్రవారం) ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు 'ఎస్పీ బాలుకు స్వరనీరాజనం' కార్యక్రమం పేరుతో 12 గంటల పాటు లైవ్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేశారు. దీని గురించి ఆర్.పి.పట్నాయక్ మాట్లాడుతూ, 'తెలుగు ఫిలిం ఇండిస్టీ అందరం కలిసి బాలుగారికి ఈ ట్రిబ్యూట్ అందిస్తున్నాం. ఈ ట్రిబ్యూట్ ఇస్తున్న వారంతా బాలుగారి పాటలు పాడటంతోపాటు ఆయన తమకి ఉన్న అనుబంధాన్ని షేర్ చేసుకుంటారు. ప్రపంచ వ్యాప్తంగా ఎన్టీవీ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానెల్, సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఈ కార్యక్రమం ప్రసారం కానుంది' అని తెలిపారు.
'నిర్మాతలు, దర్శకులు, హీరోలు, సంగీత దర్శకులు, గీత రచయితలు, సింగర్లు.. ఇలా దాదాపు పరిశ్రమకు చెందిన అందరూ ఈ ఘన నివాళిలో పాల్గొనబోతున్నారు' అని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ, నిర్మాత కెఎల్. దామోదర ప్రసాద్ అన్నారు.
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సెక్రటరీ, నటి జీవితా రాజశేఖర్ మాట్లాడుతూ, 'బాలుగారు చనిపోయిన తరువాత అప్పుడున్న పాండమిక్ పరిస్థితుల్లో ఎలా రెస్పాండ్ కావాలో తెలియని పరిస్థితి. బాలుగారి గురించి చాలా మంది చెప్పుకునే అవకాశం లేకుండా పోయింది. అలాంటి వారందరి కోసమే ఈ కార్యక్రమం. బాలుగారు చిరస్మరణీయంగా నిలిచిపోవాలన్నదే ఈ కార్యక్రమం లక్ష్యం' అని చెప్పారు. 'బాలుగారి జయంతి సందర్బంగా తెలుగు ఫిలిం ఇండిస్టీ ఓ గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. బాలు గారి అభిమానులను, సంగీత ప్రియులను ఆకట్టుకునేలా ఈ కార్యక్రమాన్ని చేయబోతున్నాం' అని డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దర్శకుడు ఎన్ శంకర్ తెలిపారు. నిర్మాతల మండలి సెక్రటరీ ప్రసన్నకుమార్ మాట్లాడుతూ, 'బాలుగారు ఏ భాషలో పాట పాడిన ఆయనకి ఆయనే సాటి. జూమ్ మీటింగ్ ద్వారా ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకునే అద్భుతమైన అవకాశం ఇది' అని అన్నారు.