Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాగవర్మ బైర్రాజును హీరోగా పరిచయం చేస్తూ హరిచందన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'విక్రమ్'. ఏ బ్రాండ్ ఇండియా మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో దివ్యాసురేశ్ కథానాయికగా నటిస్తోంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సన్నద్ధ మవుతున్న నేపథ్యంలో శనివారం ఈ చిత్ర హీరో, నిర్మాత నాగవర్మ బైర్రాజు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాలోని 'పడిపోయా పడిపోయా....'అంటూ సాగే రెండవ పాటతోపాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ, 'అగ్రకథానాయకుడు నాగార్జున 'విక్రమ్' టైటిల్ ఉన్న చిత్రంతో పరిచయమయ్యారు. అదే టైటిల్‌తో వస్తున్న హీరో నాగవర్మకు కూడా ఈ తొలి చిత్రం మంచి విజయాన్ని అందించి, అతను హీరోగా నిలబడాలని కోరుకుంటున్నా. 'పడిపోయా పడిపోయా..' అనే ఈ పాట ప్రేమికులకు ఎంతో స్ఫూర్తిని కలిగించేలా ఆకట్టుకుంటోంది. పాటల్లో, ఫైట్స్‌లోనూ నాగవర్మ అద్భుతంగా యాక్ట్ చేశాడు' అని చెప్పారు.
'శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అద్భుతం. ఈ పాట ఆయన చేతుల మీదుగా విడుదల చేయడం కరెక్ట్ అనిపించింది. మా సినిమా పాటలు, టీజర్, పోస్టర్స్ పలువురు సినీ ప్రముఖుల ద్వారా విడుదల అవుతుండటం ఎనలేని ఆనందంగా ఉంది. సమష్టి కషితో మా సినిమా చాలా బాగా వచ్చింది' అని చిత్ర హీరో, నిర్మాత నాగవర్మ బైర్రాజు అన్నారు.
దర్శకుడు హరిచందన్ మాట్లాడుతూ, 'మ్యూజికల్ లవ్‌స్టోరీకి, థ్రిల్లర్ అంశాలను జోడించి నవ్యరీతిలో ఈ చిత్రాన్ని మలిచాం. 'విక్రమ్' అనే ఓ సినిమా రచయిత పాత్ర చుట్టూ తిరిగే కొన్ని పాత్రల స్వరూప, స్వభావాలను ఇందులో చూపించాం. ఇంకా చెప్పాలంటే సొసైటీలోని పాత్రలకు చాలా దగ్గరగా ఈ పాత్రలు ఉంటాయి. తన ప్రేమను సాధించడం కోసం, ప్రేమించిన అమ్మాయిని పొందడం కోసం ఆ సినిమా రచయిత ఏమి చేశాడన్నది ఆసక్తికరంగా చెప్పాం. థియేటర్లలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయాలని అనుకుంటున్నాం' అని తెలిపారు. సంగీత దర్శకుడు సురేష్ ప్రసాద్ మాట్లాడుతూ,'ఇందులోని ఐదు పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎంతో బాగా వచ్చింది' అని అన్నారు. 'నాలుగు పాటలకు కొరియోగ్రఫీ చేశా. పాటలన్ని విజువల్‌గా అందర్నీ అలరిస్తాయి' అని కొరియోగ్రాఫర్ సత్య మాస్టర్ చెప్పారు.