Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గాన గంధర్వుడు స్వర్గీయ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం 75వ జయంతి సందర్భంగా తమ చిత్రంలోని పాటలన్ని ఆయనకు అంకితమిస్తున్నట్లు 'తీరం' చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాలో ఆయన పాడిన చివరి పాట 'అసలేంటీ ప్రేమా' పాటతో పాటు, చిత్రంలోని మిగిలిన 8 పాటలను కూడా బాలుకి అంకితం చేయటమే కాకుండా,
ఆయన గౌరవార్థం అంకితం చేసిన ఈ పాటలను
ఏ ఆడియో కంపెనీకీ అమ్మకుండా, బాలు అభిమానుల కోసం
పూర్తి ఉచితంగా 'ఫ్రీ టు ఎయిర్' గా విడుదల చేశారు.
అకి క్రియేటివ్ వర్క్స్ పతాకంపై శ్రావణ్ వైజిటి, అనిల్ ఇనమడుగు, అపర్ణ, క్రిష్టెన్ రవళి హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తీరం'. సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో మ్యూజికల్ లవ్ స్టోరీగా అనిల్ ఇనమడుగు స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా నిర్మితమైంది. ఈ చిత్రాన్ని సినెటేరియా మీడియా వర్క్స్ సంస్థ ద్వారా థియేటర్, డిజిటల్, శాటిలైట్, ఓవర్సీస్‌ల్లోనూ విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా రచయిత విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ,'ఈ సినిమా కోసం బాలు గారు పాడిన 'ఏంటీ ప్రేమ' పాట విన్నాను.. బ్యూటిఫుల్‌గా ఉంది. సాహిత్యం పరంగా వేటూరి గారిని, కెమెరా పనితనం పరంగా బాలూమహేంద్ర గారిని,
గాత్రం పరంగా బాలూలోని నవయవ్వన మధురస్వరం మనల్ని మైమరపించేలా ఉంది' అని ఆయన తెలిపారు. '75 సంవత్సరాల బాలూలోని యువస్వరాన్ని ఈ చిత్రంలోని పాట ఆవిష్కరించింది' అని పాటల రచయిత సుద్దాల అశోక్ తేజ అన్నారు. మరో గేయ రచయిత చంద్రబోస్ మాట్లాడుతూ, 'తీరం సినిమాలో సంగీతం, సాహిత్యం బాలూ గాత్రంలో అమతమై కురిసింది.
ఆ అమతాన్ని ప్రతిఒక్కరూ ఆస్వాదించాలి' అని తెలిపారు.
చిత్ర సంగీత దర్శకులు రఘురాం మాట్లాడుతూ, 'బాలుగారి గౌరవార్థం ఈ చిత్రంలోని పాటలను ఆయనకు అంకితం ఇవ్వడం చాలా గొప్ప నిర్ణయం' అని అన్నారు.
'మా సినిమా కోసం పాట పాడుతున్నప్పుడు, సంగీతం.. సాహిత్యం పోటా పోటీగా ఉన్నాయని, పాట ఖచ్చితంగా హిట్ అవుతుందని బాలు గారు అభినందించారు. బాలుగారికి అంకితం చేసిన మా సినిమాలోని పాటలను అన్ని టెలివిజన్, రేడియో, డిజిటల్ మాధ్యమాల్లో ఉచితంగా వినేలా 'ఫ్రీ టు ఎయిర్' విధానంలో విడుదల చేశాం' అని దర్శక, నిర్మాత అనిల్ ఇనమడుగు చెప్పారు.