Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో తన పుట్టినరోజున తనని కలుసుకునేందుకు అభిమానుల్ని రావొద్దని అగ్ర కథానాయకుడు బాలకృష్ణ విజ్ఞప్తి చేశారు. ఈనెల 10వ తేదీన బాలయ్య బర్త్డే. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని ఆయన్ని కలుసుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది అభిమానులు వచ్చే యత్నం చేయబోతున్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇళ్ళు దాటి రావడం శ్రేయస్కరం కాదని సోషల్ మీడియా వేదికగా బాలకృష్ణ తెలిపారు.
'నా ప్రాణ సమానులైన అభిమానులకు విజ్ఞప్తి. నా పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం నన్ను కలిసేందుకు నలుదిక్కుల నుంచి తరలివస్తున్న మీ అభిమానానికి సర్వదా విధేయుడ్ని. కానీ, కరోనా విలయతాండవం చేస్తున్న ఈ విపత్కర పరిస్థితుల్లో మీరు రావటం అభిలషణీయం కాదు. నన్నింతటి వాడ్ని చేసింది మీ అభిమానమే. ఒక్క అభిమాని దూరమైనా నేను భరించలేను. మీ అభిమానాన్ని మించిన ఆశీస్సు లేదు. మీ ఆరోగ్యాన్ని మించిన శుభాకాంక్ష లేదు. మీ కుటుంబంతో మీరు ఆనందంగా గడపటమే నా జన్మదిన వేడుక. దయచేసి ఎవరూ రావద్దని తెలియజేస్తున్నాను. ఈ విపత్కాలంలో అసువులు బాసిన నా అభిమానులకు, కార్యకర్తలకు, అభాగ్యులందరికీ నివాళులర్పిస్తున్నాను' అని బాలకృష్ణ ట్వీట్ పెట్టారు.
ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'అఖండ' చిత్రంలో నటిస్తున్న బాలకృష్ణ, త్వరలోనే మలినేని గోపీచంద్ దర్శకత్వంలో తెరకెక్కబోయే నూతన చిత్ర షూటింగ్లో పాల్గొనబోతున్నారు.