Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా క్రైసిస్ ఛారిటీ (సీసీసీ) ఆధ్వర్యంలో సినీ పరిశ్రమకు చెందిన 24 శాఖల కార్మికులకు వ్యాక్సిన్ వేసే కార్యక్రమం పున:ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని సోమవారం చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో చిరంజీవి ఆరంభించారు. నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్.శంకర్, ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ కుమార్ వల్లభనేని, సెక్రటరీ దొరైతో పాటు పలువురు ఇతర సాంకేతిక నిపుణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్బంగా చిరంజీవి మాట్లాడుతూ,'కరోనా ఫస్ట్‌వేవ్ సమయంలో సీసీసీ ద్వారా సినీ కార్మికులందరికీ మూడుసార్లు నిత్యావసర సరుకులు అందజేశాం. ఈసారి సినీ కార్మికులందరినీ ఒకే వేదికపైకి తెచ్చి సీసీసీ ఆధ్వర్యంలో వ్యాక్సిన్ వేయించాలని నిర్ణయం తీసుకున్నాం. సీసీసీకి చాలా మంది డొనేషన్స్ ఇచ్చారు. దానికి తగ్గట్టుగా సీసీసీ నేతృత్వంలో ప్రతి ఒక్క పైసా కూడా అవసరం ఉన్నవాళ్లకు చేరేలా చర్యలు తీసుకుంటాం. దానికి నేను భరోసా. చిత్ర పరిశ్రమలోని 24 క్రాఫ్ట్స్ వర్క్ర్స్కి, ఫిలిం ఫెడరేషన్ సభ్యులకు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులతో పాటు సినిమా జర్నలిస్ట్‌లకు కూడా వ్యాక్సిన్ ఇప్పిస్తున్నాం. సీసీసీ తలపెట్టిన ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను చిరంజీవి చారిటబుల్ ట్రస్టు, అపోలో హాస్పిటల్ సహకారంతో పునః ప్రారంభించాం. మూడు వారల క్రితమే మొదలైనప్పటికీ వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడంతో గ్యాప్ వచ్చింది. ఈ సందర్బంగా అపోలో వారికి, సినిమా కార్మికులు అందరూ వ్యాక్సినేషన్లో పాల్గొనేలా మోటివేట్ చేసిన భరద్వాజ, ఎన్.శంకర్, అనిల్, దొరైకి అభినందనలు తెలియజేస్తున్నాను' అని చెప్పారు.