Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా సెకండ్ వేవ్ ధాటికి యావత్ చిత్ర పరిశ్రమ తీవ్ర ఇబ్బందుల్లో పడింది. సినీ కార్మికులకు ఉపాధి లేకుండా చేసింది. మేకర్స్‌ని ఆర్థికంగా దెబ్బతీసింది. మహమ్మారి చేసిన విలయ తాండవానికి చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా ఆక్సిజన్ సమస్య కారణంగా తుదిశ్వాస విడవటం బాధాకరం. ఇటువంటి పరీక్షా సమయంలో ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే అధినేత విజరు కిరంగదూర్ భారీ సాయాన్ని అందించేందుకు ముందుకొచ్చారు. రెండు కోట్ల రూపాయలను ఖర్చు చేసి కర్ణాటకలోని మాండ్య ప్రాంతంలో రెండు ఆక్సిజన్ ప్లాంట్స్, 20 ఆక్సిజన్ బెడ్స్ని ఏర్పాటు చేశారు. అలాగే తెలుగు చిత్ర పరిశ్రమలోని వివిధ శాఖల్లోని 3200 మంది సభ్యులకు రూ.35 లక్షల సాయాన్ని అందించారు. ఈ నిర్మాణ సంస్థ అగ్ర కథానాయకుడు ప్రభాస్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 'సలార్' పాన్ ఇండియా సినిమా కేవలం పది రోజుల షూటింగ్ మాత్రమే పూర్తి చేసుకుంది. అయినప్పటికీ ఈ సినిమా కోసం పని చేస్తున్న 150 మంది యూనిట్ సభ్యుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.5000 చొప్పున ఆర్థిక సాయాన్ని అందించారు. గత ఏడాది కరోనా ఫస్ట్‌వేవ్ సమయంలోనూ 350 మంది సినీ కార్మికులకు ఒక్కొక్కరికీ రూ.5000 వేల ఆర్థిక సాయాన్ని రెండు నెలల పాటు అందించి కొండంత అండగా నిర్మాత విజరు కిరంగదూర్ నిలబడ్డారు.