Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పవన్‌కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతున్న విషయం విదితమే. అయితే గత కొన్ని రోజులుగా ఈ చిత్రానికి సంబంధించి పలు రూమర్స్‌తో పాటు ఫ్యాన్స్ తయారు చేసిన పోస్టర్లు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. అందర్నీ అయోమయంలో పడేస్తున్న వీటిపై చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీమూవీ మేకర్స్ స్పందిస్తూ, మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది.
'పవన్‌కల్యాణ్ 28వ చిత్రానికి సంబంధించి ఈ ఏడాది ఉగాది రోజున ఫస్ట్‌లుక్, టైటిల్ విడుదల చేయాలని భావించాం. అయితే, కరోనా కారణంగా ఆ నిర్ణయాన్ని వాయిదా వేశాం. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా అనేక వార్తలు, ఫొటోలు, పోస్టర్లు హల్చల్ చేస్తున్నాయి. అభిమానులు ఒక్క విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. సినిమాకి సంబంధించిన ఏ విషయమైనా అధికారిక ఖాతాల ద్వారా సరైన సమయంలో వెల్లడిస్తాం' అని ప్రకటనలో మైత్రి మూవీ మేకర్స్ పేర్కొంది. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని నవీన్ యర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు. పవన్‌కళ్యాణ్ దీంతోపాటు 'అయ్యప్పనుమ్ కొషియుమ్' రీమేక్, 'హరి హర వీరమల్లు' చిత్రాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే.