Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రేక్షకుల రోమాలు నిక్కబొడుచుకునేలా వాయిస్ ఓవర్ చెప్పడంలో అగ్రకథానాయకుడు ఎన్టీఆర్ తనకు తానే సాటి అని వేరే చెప్పక్కర్లేదు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ 'ఆర్ఆర్ఆర్' సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్ పోషిస్తున్న పాత్ర గురించి ఎన్టీఆర్ చెప్పిన వాయిస్ ఓవర్ ఆయన అభిమానుల్నే కాదు ప్రేక్షకుల్ని సైతం ఫిదా చేసింది.
'ఆడు కనబడితే నిప్పు కణం నిలబడినట్టుంటది.. కలవడితే ఏగు చుక్క ఎగబడినట్టుంటది.. ఎదురు పడితే చావుకైనా చెమట దారకడతది.. పానమైనా బంధూకైనా వానికి బాంచనైతది.. ఇంటి పేరు అల్లూరి.. సాకింది గోదారి.. నా అన్న.. మన్నెం దొర.. అల్లూరి సీతారామరాజు..' అంటూ రామ్‌చరణ్ క్యారెక్టర్ని ఎలివేట్ చేస్తూ అత్యద్భుతమైన వాయిస్ మాడ్యూలేషన్‌తో ఎన్టీఆర్ చెప్పిన వైనం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇదిలా ఉంటే, తాజాగా ఆయన సోదరుడు కళ్యాణ్‌రామ్ నటిస్తున్న 'బింబిసార' చిత్రానికి కూడా వాయిస్ ఓవర్ అందించబోతున్నారని వినిపిస్తోంది. మగధ సామ్రాజ్యంలోని హర్యంక రాజవంశ రాజు బింబిసారుడి జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతున్న ఈ చిత్రాన్ని మూడు భాగాలుగా విడుదల చేయబోతున్నారని సమాచారం. దీంతో బింబిసారుడి గురించి ప్రేక్షకులకు మరింత క్లియర్‌గా అర్థం కావడం కోవడం ఎన్టీఆర్‌తో వాయిస్ ఓవర్‌ని చెప్పించబోతున్నారట. ఈ చిత్రానికి నూతన దర్శకుడు వశిష్ట్ దర్శకత్వం వహిస్తున్నారు. కల్యాణ్‌రామ్‌కు జంటగా క్యాథరిన్, సంయుక్త మీనన్ నటిస్తున్నారు. చిరంతన్ భట్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ సమర్పణలో కె.హరికష్ణ నిర్మిస్తున్నారు. ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న 'ఆర్ఆర్ఆర్'తో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత దర్శకులు కొరటాల శివ, ప్రశాంత్ నీల్‌తో వరుసగా సినిమాలు చేయబోతున్నారు.