Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'సీసీసీ ఆధ్వర్యంలో చేపట్టిన వ్యాక్సిన్ డ్రైవ్ ద్వారా సినీ పరిశ్రమకి చెందిన అందరూ టీకాలు వేయించుకోండి. గత వారం రోజులుగా పరిశ్రమకు సంబంధించిన 24 సెక్టార్స్ నుంచి దాదాపు 4 వేలకు పైగా సినీ కార్మికులకు టీకాలు వేయించాం' అని డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్.శంకర్ తెలిపారు.
కరోనా క్రైసిస్ ఛారిటి (సీసీసీ)ని ఏర్పాటు చేసి, గత ఏడాది కరోనా సమయంలో సినీ కార్మికులకు మూడు సార్లు నిత్యావసర వస్తువులు పంపిణి చేసిన విషయం తెలిసిందే. ఈసారి కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో సినీ కార్మికులకు అందరికీ వ్యాక్సిన్ వేయించే కార్యక్రమం చేపట్టారు. ఇటీవలే చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో ఈ డ్రైవ్ ఆరంభమైంది. ఈ కార్యక్రమంలో 24 క్రాఫ్ట్స్‌కు చెందిన సినీ కార్మికులకు అందరికీ వ్యాక్సిన్ ఇస్తున్నారు. గత వారం రోజులుగా ఈ వ్యాక్సిన్ డ్రైవ్ విజయవంతంగా జరుగుతోంది. ఈ సందర్భంగా డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్.శంకర్ మాట్లాడుతూ,'ఇప్పటివరకు 4000 మందికి పైగా వ్యాక్సిన్ తీసుకున్నారు. సినీ కార్మికులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అలాగే ఫెడరేషన్ సభ్యులు, సినీ పాత్రికేయులకు కూడా వ్యాక్సిన్ ఇస్తున్నాం. మిగతా విభాగాలకు చెందిన అందరూ దయచేసి వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందుకు రావాలి. అప్పుడే షూటింగ్స్ తొందరగా స్టార్ట్ అవుతాయి. అందరూ వ్యాక్సిన్ తీసుకుని ఈ డ్రైవ్‌ని మరింత విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాం. ఈ వ్యాక్సిన్ డ్రైవ్ నిర్వహణకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు' అని తెలిపారు.