Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మోహన్‌బాబు కథానాయకుడిగా శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై విష్ణు మంచు నిర్మిస్తున్న చిత్రం 'సన్ ఆఫ్ ఇండియా'. డైమండ్ రత్నబాబు దర్శకుడు. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రానికి ఇళయరాజా స్వరాలు సమకూరుస్తున్నారు. ఈనెల 15న ఈ చిత్రంలోని తొలి పాటని విడుదల చేస్తున్నట్టు మోహన్ బాబు ప్రకటించారు. తన కెరీర్లో సూపర్ హిట్‌గా నిలిచిన 'పెదరాయుడు' చిత్రం విడుదలైన రోజునే 'సన్ ఆఫ్ ఇండియా' చిత్రానికి సంబంధించిన లిరికల్ వీడియోని విడుదల చేస్తుండటం చాలా ఆనందంగా ఉందని ఆయన చెప్పారు. '1995 జూన్ 15న 'పెదరాయుడు' రిలీజ్ అయ్యింది. 26 సంవత్సరాల తర్వాత మళ్ళీ 2021 జూన్ 15న 'సన్ ఆఫ్ ఇండియా' చిత్రానికి సంబంధించిన లిరికల్ వీడియో రిలీజ్ కానుండటం శుభసూచకంగా భావిస్తున్నాను. అప్పుడు 'పెదరాయుడు' చిత్రానికి నిర్మాతని నేనైతే.. ఇప్పుడు ఈ చిత్రానికి నిర్మాత నా తనయుడు విష్ణు వర్థన్ బాబు కావడం సంతోషదాయకం. ఈ చిత్రంలోని 11వ శతాబ్దపు రఘువీర గద్యం.. మ్యాస్ట్రో ఇళయరాజా సంగీత సారథ్యంలో రాహుల్ నంబియార్ స్వరంతో లిరికల్ వీడియోగా మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఈ పాటని మర్యాద పురుషోత్తముడైన శ్రీరాముడికి అంకితం ఇస్తున్నాను' అని మోహన్‌బాబు సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఇటీవల చిరంజీవి రిలీజ్ చేసిన ఈ చిత్ర టీజర్‌కి అనూహ్య స్పందన రావడంతో సినిమాపై సర్వత్రా భారీ అంచనాలు పెరిగాయి.