Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సామాజిక సందేశాలను పక్కా కమర్షియల్ ఫార్మెట్లో చెప్పడంలో రచయితగానే కాదు దర్శకుడిగా కూడా కొరటాల శివ తనకు తానే సాటి. ఆయన దర్శకత్వం వహించింది నాలుగు చిత్రాలే అయినప్పటికీ ప్రతి సినిమా దేనికదే వైవిధ్యం. అన్నింటికి మించి కథనే హీరో చేసిన దర్శకుడు. స్టార్ హీరోలు, పక్కా కమర్షియల్ హంగులు ఉన్నప్పటికీ అంతర్లీనంగా ప్రజల సమస్యలను వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించారు.
'మిర్చి' సినిమాలో ఫ్యాక్షన్ గొడవల వల్ల జరిగే అనర్థాలు, 'శ్రీమంతుడు' చిత్రంలో ఊరిని దత్తత తీసుకోవడం అనే కాన్సెప్ట్‌ని, 'భరత్ అనే నేను' సినిమాలో స్వార్థపూరిత రాజకీయాల వల్ల జరిగే నష్టాలు, గ్రామీణాభివృద్ది వంటి అంశాల్ని, అలాగే 'జనతా గ్యారేజ్'లో పర్యావరణ పరిరక్షణ గురించి చూపించారు. సమాజానికి ఉపయోగపడేలా సినిమాల్ని తీస్తూ అటు ప్రేక్షకులు, ఇటు సినీ వర్గాల మనసుల్ని దోచుకున్నారు కొరటాల శివ. మంగళవారం ఆయన పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఆ కలానికి సమాజంలో మార్పు తేవాలనే తపన ఉంది. ఆ దర్శకుడికి, ఆశయాన్ని దశ్యంగా మలిచే దార్శనికత ఉంది. 'ఆచార్య' సష్టికర్త కొరటాల శివకి జన్మదిన శుభాకాంక్షలు.
- చిరంజీవి
స్నేహానికి విలువ ఇచ్చే వ్యక్తిత్వం అరుదు. అటువంటి అరుదైన స్నేహితుడు, సన్నిహితుడు అయిన కొరటాల శివకి హదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
- ఎన్టీఆర్
కొరటాల శివగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ 'ఆచార్య' సెట్లో కొరటాలతో కలిసి హాయిగా నవ్వుకుంటున్న ఓ ఫొటోని కథానాయకుడు రామ్ చరణ్ అభిమానులతో షేర్ చేసుకున్నారు. అలాగే మహేష్‌బాబు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ కొరటాలతో ఉన్న అనుబంధాన్ని తెలిపారు. కొరటాల శివ ప్రస్తుతం చిరంజీవితో 'ఆచార్య' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమా కూడా ఆలయాలు, నక్సలైట్ల నేపథ్యంలో ఉంది. ఈ సినిమా ద్వారా ఆయన ఎలాంటి సామాజిక సందేశం ఇవ్వబోతున్నారనేది విడుదల వరకు వేచి చూడాల్సిందే. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్‌తో కొరటాల ఓ సినిమా చేయబోతున్నారు.