Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా మహమ్మారి కారణంగా ఆగిపోయిన సినిమా చిత్రీకరణలు పున: ప్రారంభం అవుతున్నాయి. ఈ సందర్భంగా నటీనటులు, సాంకేతిక నిపుణులు, దర్శక, నిర్మాతలతోపాటు సినిమాకి సంబంధించిన 24 సెక్టార్ల కార్మికులు విధిగా కొన్ని నియమ, నిబంధలను పాటించాలని తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, తెలుగు ఫిలిం డైరెక్టర్ అసోసియేషన్, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) జరిపిన సంయుక్త సమావేశంలో సూచించారు. వాటి వివరాలు..
కరోనా వైరస్ విజృంభణతో ఏప్రిల్ నుంచి చిత్రీకరణలు ఆగిపోయాయి. ఇప్పుడు పున: ప్రారంభం అవుతున్నందున నటీనటులు గతంలో షూటింగ్ చేస్తూ ఆగిపోయిన చిత్రాలకు మాత్రమే ప్రాముఖ్యత ఇస్తూ, ఆ సినిమాల షూటింగ్స్‌లోనే పాల్గొన్నాలి. అలాగే 24 క్రాఫ్ట్స్ సంబంధించి ఎవరైనా సరే ఆగిపోయి ఉన్న చిత్రాలకు మాత్రమే పని చేయాలి. బ్యాలెన్స్ వర్క్ పూర్తి అయిన తర్వాతే కొత్త సినిమాలు చేయాలి.
దర్శకులతోపాటు అన్ని విభాగాల వారు ఆగిపోయి ఉన్న చిత్రాలకు సంబంధించి షెడ్యూల్స్‌ని కుదించుకుని తక్కువ రోజుల్లో నిర్మాణం పూర్తి చేయాలి. గత రెండున్నర నెలల నుండి షూటింగ్‌ల కోసం అంగీకరించిన తేదీలకు అనుగుణంగా మళ్ళీ సదరు సినిమాలకు తేదీలు కేటాయించాలి. చిత్రీకరణలు చేసే ప్రొడక్షన్ సంస్థలు ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్ల నుండి వ్యాక్సిన్ తీసుకున్నట్లుగా డిక్లరేషన్ తీసుకోవాలి.
షూటింగ్‌కి హాజరయ్యే ప్రతి యూనియన్ సభ్యుడు కనీసం ఒక డోస్ వ్యాక్సిన్ కచ్చితంగా తీసుకొని ఉండాలి. అలా తీసుకున్న సభ్యుల్ని మాత్రమే షూటింగ్‌కి హాజరయ్యే విధంగా తెలుగు ఫిలిం ఇండిస్టీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చర్యలు తీసుకోవాలి. అలాగే ఫెడరేషన్‌లోని 24 విభాగాల సభ్యులందరికీ ఇన్య్సూరెన్స్ విధిగా చేయించాలి. ఈ బాధ్యతని ఫెడరేషన్‌తోపాటు ఆయా యూనియన్లు తీసుకోవాలి.
ప్రభుత్వం వారు ఎప్పటికప్పుడు ప్రకటిస్తున్న మార్గదర్శకాలు విధిగా అందరూ పాటించాలి. ఈ సూచనలను ప్రొడక్షన్ హౌస్ మేనేజర్లు, ఆర్టిస్ట్‌ల మేనేజర్లు తప్పనిసరిగా సాంకేతిక నిపుణులకు, కళాకారులకు తెలియజేయాలి. అలాగే ప్రతి ఒక్క టెక్నీషియన్, ఆర్టిస్ట్ వ్యక్తిగతంగాను, వ్యవస్థ పరంగానూ సామాజిక బాధ్యతతో తగు జాగ్రత్తలు తీసుకొంటూ చిత్రీకరణల్లో పాల్గొనాలి.
ఈ అంశాలకు సంబంధించి సలహాలు, ఫిర్యాదులు లేదా ఎవరైనా వీటిని పాటించని తరుణంలో తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌కి తెలియజేస్తే తగు చర్యలు తీసుకుంటుందని తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు నారాయణ దాస్ కిషన్ దాస్ నారంగ్, గౌరవ కార్యదర్శులు కె.ఎల్.దామోదర్ ప్రసాద్, ఎం. రమేష్ తెలిపారు.