Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశవ్యాప్తంగా టాలీవుడ్ సరికొత్త సంచలనాలకు కేంద్రబిందువుగా మారబోతోంది. ఇప్పటికే శంకర్, మురుగదాస్ వంటి తదితర అగ్ర తమిళ దర్శకులు మన హీరోలతో సినిమాలు చేస్తుంటే, తమిళ స్టార్లు సైతం మన దర్శకులతో సినిమాలు చేసేందుకు అమితాసక్తి చూపిస్తున్నారు.
లేటెస్ట్గా విజరు, సూర్య తెలుగు సినిమాల్లో నటిస్తున్నట్టు ప్రకటించారు. ఈ కోవలోనే మరో తమిళ స్టార్ హీరో ధనుష్ కూడా ఓ తెలుగు స్ట్రయిట్ సినిమాలో నటించ బోతున్నారు. పాన్ ఇండియా సినిమా రేంజ్లో తెరకెక్కబోయే ఈ చిత్రానికి శేఖర్‌కమ్ముల దర్శకత్వం వహించబోతున్నారని సమాచారం. ఈ నయా కాంబినేషన్లో పాన్ ఇండియా సినిమాని నిర్మించేందుకు శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి నిర్మాణ సంస్థ ఇప్పటికే రంగం సిద్ధం చేసింది. శ్రీమతి సునీతా నారంగ్ జయంతి సందర్భంగా ఈ చిత్రాన్ని నేడు (శుక్రవారం) నిర్మాత సునీల్ నారంగ్ అధికారికంగా ప్రకటించబోతున్నారు. సున్నిత అంశాలతో తనదైన శైలిలో సినిమాలను తెరకెక్కించే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ వంటి స్టార్ హీరో నటించబోతున్నారనేది సోషల్ మీడియాలో హాట్ న్యూస్ అయ్యింది. ఇక ధనుష్‌కి తెలుగునాట కూడా మంచి మార్కెట్ ఉంది. అలాగే ఆయనకంటూ ఓ ప్రత్యేక అభిమాన గణమూ ఉంది. భిన్న సినిమాలు, వైవిధ్యమైన పాత్రలతో ధనుష్ విలక్షణ నటుడిగా అందర్నీ ఫిదా చేస్తున్నారు. ఇటీవల విడుదలైన 'అసురన్', 'కర్ణన్' చిత్రాల్లో ధనుష్ తన నట విశ్వరూపంతో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేశారు. ఇక ఈ రెండు సినిమాలు ప్రస్తుతం తెలుగులో రీమేక్ అవుతున్నాయి. వెంకటేష్ కథానాయకుడిగా 'అసురన్' చిత్రాన్ని 'నారప్ప'గా రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. అలాగే బెల్లంకొండ సాయిశ్రీనివాస్ కథానాయకుడిగా 'కర్ణన్' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయబోతున్నారు. దీనికి అగ్ర దర్శకుడు వి.వి.వినాయక్ దర్శకత్వం వహించే అవకాశం ఉంది. శేఖర్ కమ్ముల ప్రస్తుతం 'లవ్‌స్టోరీ' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా సునీల్ నారంగ్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.