Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సూపర్‌స్టార్ హోదాలో ఉన్నప్పటికీ కథ బాగుంటే చిన్న సినిమానా, పెద్ద సినిమానా అనేది చూడకుండా నటించటం ఒక్క మోహన్‌లాల్‌కే చెల్లింది. ఓ పక్క 'మరక్కర్ : లయన్ ఆఫ్ అరేబియన్ సీ' వంటి భారీ బడ్జెట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రెడీ అవుతూ, మరో పక్క తాజాగా 'బ్రో డాడీ' సినిమాలో నటించడానికి మోహన్‌లాల్ అంగీకరించడం విశేషం. నటుడు, దర్శకుడు పథ్విరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో మీనా, కళ్యాణి ప్రియదర్శన్తోపాటు పథ్విరాజ్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆశీర్వాద్ సినిమాస్ పతాకంపై ఆంటోని పెరుంబవూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'త్వరలోనే రెగ్యులర్ షూటింగ్‌ని ప్రారంభించబోతున్నాం. అందరూ హాయిగా నవ్వుకునేలా ఈ సినిమా ఉంటుంది' అని పథ్విరాజ్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. శనివారం 'బ్రో డాడీ' చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ని కూడా ఆయన అభిమానులతో షేర్ చేసుకున్నారు. గతంలో మోహన్ లాల్ - పథ్విరాజ్ కాంబినేషన్లో 'లూసీఫర్' సినిమా రూపొందింది. విశేష ప్రేక్షకాదరణతో ఈ సినిమా సంచలన విజయం సాధించింది. ఇదే చిత్రాన్ని తెలుగులో చిరంజీవి రీమేక్ చేస్తున్నారు. దీనికి మోహన్‌రాజా దర్శకుడు. దాదాపు 100 కోట్లకి పైగా భారీ బడ్జెట్‌తో, అర్జున్, సునీల్‌శెట్టి, ప్రభు, మంజువారియర్, కీర్తిసురేష్, నెడిముడి వేణు, ముఖేష్ సిద్ధిఖీ వంటి హేమాహేమీలతో ప్రియదర్శన్ దర్శకత్వంలో మోహన్‌లాల్ నటించిన 'మరక్కర్' చిత్రం ఆగస్ట్ 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.