Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జాతీయంగా, అంతర్జాతీయంగా ఇప్పుడు అందరి దృష్టి తెలుగు చిత్ర పరిశ్రమపైనే ఉంది. తెలుగు సినిమా సత్తా చాటుతుండటంతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు ఇతర చిత్ర పరిశ్రమలకు చెందిన స్టార్ హీరోలు, దర్శకులు అమితాసక్తి చూపిస్తున్నారు. ఇందులో భాగంగా కన్నడ 'కేజీఎఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో ప్రభాస్, ఎన్టీఆర్ సినిమాలు చేస్తున్న విషయం విదితమే. అలాగే తమిళ దర్శకుడు శంకర్‌తో రామ్‌చరణ్, తమిళ స్టార్ హీరో విజరుతో దర్శకుడు వంశీ పైడిపల్లి సినిమాలు చేస్తున్నారు. ఇక లేటెస్ట్గా మరో స్టార్ హీరో ధనుష్ సైతం శేఖర్‌కమ్ములతో కలిసి ఓ త్రిభాషా సినిమా చేయబోతున్నారు. వీరి కోవలోనే తమిళ అగ్ర కథానాయకుడు సూర్య కూడా దర్శకుడు బోయపాటి శ్రీనుతో ఓ పాన్ ఇండియా చిత్రాన్ని చేసేందుకు సిద్ధంగా ఉన్నారనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇదే నేపథ్యంలో దర్శకుడు త్రివిక్రమ్ కూడా సూర్యకి ఇటీవల ఓ కథ చెప్పారని వినిపిస్తోంది. సూర్యకి కథ నచ్చటంతో ఈ సినిమా కూడా త్వరలోనే పట్టాలెక్కే ఛాన్స్ ఉందట. అయితే తమిళ స్టార్ హీరోలతో సినిమాలు చేయటానికి మన నిర్మాతలు మాత్రం విపరీతంగా డబ్బుల్ని కుమ్మరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ధనుష్‌కి 50 కోట్లు, వచ్చే లాభాల్లో వాటాతోపాటు 80 కోట్ల రూపాయల భారీ పారితోషికాన్ని విజరుకి మన నిర్మాతలు ఇస్తున్నారని సమాచారం. త్రివిక్రమ్ ప్రస్తుతం మహేష్‌బాబుతో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్న విషయం విదితమే. అక్టోబర్‌లో ఈ సినిమాకి సంబంధించి రెగ్యులర్ షూటింగ్ ఆరంభం కానుంది. అలాగే పవన్‌కళ్యాణ్ నటిస్తున్న 'అయ్యప్పనుమ్ కోషియున్' రీమేక్‌కి సంభాషణలు అందిస్తున్నారు. దీంతోపాటు పవర్‌స్టార్‌తో ఓ సినిమా కోసం కథాచర్చలు కూడా జరుగుతున్నాయి.