Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నితిన్, నభా నటేష్ జంటగా నటిస్తున్న చిత్రం 'మాస్ట్రో'. ఇందులో తమన్నా ఓ ముఖ్య పాత్ర పోషిస్తోంది. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది.
ఈ క్రైమ్ కామెడీ చిత్రానికి సంబంధించి ఫైనల్ షెడ్యూల్ ఇటీవల హైదరాబాద్‌లో ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ షెడ్యూల్లో సినిమాకి సంబంధించి అత్యంత కీలకమైన సన్నివేశాలను నితిన్, తమన్నాపై చిత్రీకరించారు. దీంతో చిత్రీకరణ మొత్తం పూర్తయ్యింది.
నితిన్ హీరోగా నటిస్తున్న 30వ చిత్రమిది. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని శ్రేష్ఠ్ మూవీస్ నిర్మిస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి.
'కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత షూటింగ్లో పాల్గొన్న తొలి స్టార్ హీరో సినిమా 'మాస్ట్రో' కావడం విశేషం. ఇప్పటికే నితిన్ బర్త్‌డే సందర్భంగా విడుదల చేసిన ఈ చిత్ర ఫస్ట్‌లుక్, టీజర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. మహతి స్వరసాగర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. నితిన్ హిట్ మూవీ 'భీష్మ'కి కూడా ఆయనే మ్యూజిక్ డైరెక్టర్. దీంతో మ్యూజిక్ పరంగా ఈ సినిమాపై సర్వత్రా భారీ అంచనాలు ఉన్నాయి. ఆద్యంతం ఆకట్టుకునే కథాకథనం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. రాజ్‌కుమార్ ఆకెళ్ళ సమర్పణలో ఎన్. సుధాకర్‌రెడ్డి, నిఖితా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి త్వరలోనే ఈ చిత్రాన్ని తీసుకొచ్చేందుకు దర్శక, నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు' అని చిత్ర యూనిట్ పేర్కొంది. నరేష్, జిస్సూ సేన్ గుప్తా, శ్రీముఖి, అనన్య, హర్షవర్దన్, రచ్చ రవి, మంగ్లీ, శ్రీనివాసరెడ్డి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి డీఓపీ: జె యువరాజ్, ఎడిటర్: ఎస్ఆర్ శేఖర్, ఆర్ట్ డైరెక్టర్: సాహి సురేష్, నిర్మాతలు: ఎన్. సుధాకర్‌రెడ్డి, నిఖితా రెడ్డి, డైరెక్షన్, డైలాగ్స్: మేర్లపాక గాంధీ.