Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రతి ఏటా సాధారణ ఎన్నికలను తలపిస్తున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ఈ ఏడాది కూడా అదే రీతిలో జరగబోతున్నాయి. ఈ ఏడాది అధ్యక్ష పదవికి పోటీ చేస్తానని ప్రకాష్‌రాజ్ ప్రకటించిన 24 గంటల్లోనే, అదే స్థానానికి తాను కూడా పోటీ చేస్తున్నట్టు మంచు విష్ణు అధికారికంగా ప్రకటించారు. దీంతో వచ్చే నెలలో జరగబోయే 'మా' ఎన్నికల పోటీకి రసవత్తర ఘట్టం సిద్ధమైంది. కొత్త తరం, కొత్త ఆలోచనలతో ముందుకు సాగితే మేలు జరుగుతుందనే అభిప్రాయంతో మంచు విష్ణు ఈ నిర్ణయం తీసుకున్నారు. పక్కా ప్రణాళికతోనే విష్ణు అడుగులు వేస్తున్నారు. తన తండ్రి మోహన్ బాబు ఆశీస్సులతో పాటు కష్ణ, కష్ణంరాజు వంటి ప్రముఖ నటులను, నటీమణులను కూడా విష్ణు సంప్రదించి ఈ పోటీలో నిలబడటానికి సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా సోమవారం కృష్ణని మోహన్‌బాబు, విష్ణు కలిసి ఈసారి 'మా' ఎన్నికల్లో విష్ణు ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నాడే విషయాన్ని వివరించినట్టు సమాచారం. 'మా' సభ్యుల సంక్షేమం, 'మా' సొంత భవనం ఏర్పాటుకు కషి వంటి అంశాలు ప్రధాన ఎజెండాగా మంచు విష్ణు పరిశ్రమలోని అందర్నీ కలవబోతున్నారు. ప్రస్తుతం 'మా' అధ్యక్షుడిగా సీనియర్ నరేష్ ఉన్నారు. ఆయన పదవి కాలం ముగుస్తుండటంతో వచ్చే నెల 2 లేదా 9వ తేదీల్లో ఎన్నికలు నిర్వహించాలని 'మా' నిర్ణయించింది. ఈ నేపథ్యంలో అధిక ప్రాధాన్యత ఉన్న 'మా' అధ్యక్ష పదవి రేస్‌లో ఇప్పటికే ప్రకాష్‌రాజ్, మంచు విష్ణు ఉన్నారు. వీరితోపాటు మాజీ 'మా' అధ్యక్షుడు శివాజీరాజా కూడా పోటీలో పాల్గొనే అవకాశం ఉన్నట్టు వినిపిస్తోంది. ఏదిఏమైనా ఈ ఏడాది కూడా 'మా' ఎన్నికలు హాట్ హాట్‌గా జరగబోతున్నాయని ప్రస్తుతం పరిణామాలు చెప్పకనే చెబుతున్నాయి.