Authorization
Mon Jan 19, 2015 06:51 pm
త్వరలో జరగబోయే 'మా' (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికలు ఆసక్తికరంగా మార బోతున్నాయి. ముఖ్యంగా 'మా' అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న అభ్యర్థుల విషయం అందర్నీ సర్ప్రైజ్ చేస్తోంది. ఇప్పటికే సీనియర్ నటుడు ప్రకాష్‌రాజ్, యువ కథానాయకుడు మంచు విష్ణు అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో లేటెస్ట్గా నటి, నిర్మాత, దర్శకురాలు జీవిత కూడా ప్రెసిడెంట్ పదవికి పోటీ చేయబోతోందనే వార్తలు సోషల్‌మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. దీంతో 'మా' అధ్యక్ష పదవికి త్రిముఖ పోటీ తప్పదని తెలుస్తోంది. జీవిత ప్రస్తుతం 'మా'కి సెక్రటరీగా వ్యవహరిస్తున్నారు.
2019-2021 సంవత్సరాలకు సంబంధించి 'మా' కార్యవర్గం పదవీ కాలం త్వరలోనే ముగియబోతోంది. వచ్చే నెల 2 లేదా 9వ తేదీల్లో 2021 -2023 సంవత్సరాలకు సంబంధించి 'మా' ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ సందర్భంగా 'మా' ఎన్నికల్లో ముఖ్యంగా అధ్యక్ష పదవి కోసం హేమాహేమీలు బరిలోకి దిగుతుండటంతో ఎన్నికల వాతావరణం రోజు రోజుకి హీటెక్కుతోంది.
షూటింగ్‌లకు సకాలంలో రాకుండా నిర్మాతల్ని ఇబ్బంది పెట్టారనే ఆరోపణలతో ఇదే 'మా'కి పలుమార్లు ప్రకాష్‌రాజ్ సంజాయిషీ చెప్పుకోవాల్సి వచ్చిందని, 'మా'కూడా ఆయన్ని కొన్నిసార్లు సినిమాల్లో నటించకుండా బహిష్కరించిందనే విషయాలతోపాటు ఆయన పరభాషా నటుడనే అంశంతో లోకల్, నాన్ లోకల్ ఫీలింగ్‌ని నటీనటుల్లో తీసుకొచ్చే ప్రయత్నాలు ఇప్పటికే కొన్ని వర్గాలు ఆరంభించినట్టు తెలుస్తోంది.
పరభాషా నటీనటులకు చెక్ పెట్టే ఉద్దేశ్యంతోనే మంచు విష్ణు ఎన్నికల బరిలోకి దిగుతున్నారని కూడా బాగా వినిపిస్తోంది. వీరిద్దరూ ఇప్పటికే సినీ పెద్దల అండదండల్ని సమీకరించుకునే పనిలో బిజీగా ఉన్నారు. వీరిద్దరి మధ్య గట్టి పోటీ ఉంటుందనుకుంటున్న టైమ్‌లో ఫైర్‌బ్రాండ్‌గా పేరొందిన జీవిత సైతం పోటీ చేస్తానని బరిలోకి దిగుతుండటంతో 'మా' ఎన్నికలు మరింత ఉత్కంఠత రేకెత్తిస్తున్నాయి.