Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'నా తండ్రి నుంచి విముక్తి కలిగించి, నాకు కొత్త జీవితాన్ని ఇప్పించండి' అంటూ పాప్ సంచలనం బ్రిట్నీ స్పియర్స్ కన్నీటిపర్యంతమైన తీరు అందర్నీ కలచివేస్తోంది. పాప్ తరంగంగా విశ్వ వ్యాప్తంగా కోట్లాదిమంది అభిమాన గణాన్ని సొంతం చేసుకున్న బ్రిట్నీ ప్రస్తుత జీవితం అత్యంత దయనీయంగా ఉందని ఈ మాటలు అద్దం పడుతున్నాయి. గత 13 సంవత్సరాలుగా ఏ రోజూ తాను ఆనందంగా లేనని, తన తండ్రి కారణంగా నరకం చూస్తున్నానంటూ 20 నిమిషాల పాటు జడ్జి ముందు కన్నీళ్లతో బ్రిట్నీ ఆవేదన వ్యక్తం చేసిన తీరు అత్యంత బాధాకరం. తనకు గార్డియన్గా తన తండ్రిని ఉంచొద్దని, తన తండ్రి నుంచి తనకు రక్షణ కల్పించాలని పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ కాలిఫోర్నియా ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. బుధవారం ఈ పిటిషన్ మీద జరిగిన వాదనల్లో బ్రిట్నీ ఆద్యంతం కన్నీటిపర్యంతమైంది. తన తండ్రి వల్ల తాను రోజూ నరకం అనుభవించానని, ఇష్టం లేకపోయినా గంటల తరబడి పని చేశానని జడ్జికి బ్రిట్నీ చెప్పారు. తన డబ్బు, హోదాని ఆయనే అనుభవించాడని, తన సంపాదనలో ఒకటో వంతును కూడా తన ఖర్చులకు ఇవ్వలేదని వాపోయారు. తన ఫోన్ దగ్గరి నుంచి విలువైన కార్డుల వరకు అన్నీ ఆయన కంట్రోల్లో ఉన్నాయని ఆమె చెప్పారు. రోజూ తనకు లిథియం డ్రగ్ ఎక్కించేవాడని, తన పిల్లలకు కూడా తనని దూరం చేశాడని బ్రిట్నీ ఆరోపించింది. మళ్లీ పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించాలనే తన ఆశలకు సైతం తండ్రి అడ్డుపడ్డాడని, ఆయన సంరక్షణ తనకు మంచి కంటే చెడు ఎక్కువగా చేసిందని తెలిపింది. ఇప్పుడు నేను అనుభవిస్తున్న జీవితం ఒక రకంగా 'సెక్స్ ట్రాఫికింగ్'కి సమానం. ఇకనైనా నా జీవితం నాకు ఇప్పించండి అంటూ న్యాయమూర్తిని బ్రిట్నీ వేడుకున్నారు.