Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేయాలనేది ఒక్కరోజులో తీసుకున్న నిర్ణయం కాదు. అలాగే మా ప్యానెల్ కూడా ఆవేశంతో పుట్టింది కాదు.. ఆవేదనతో పుట్టింది' అని ప్రకాష్ రాజ్ అన్నారు. త్వరలోనే 'మా' ఎన్నికలు జరగబోతున్న తరుణంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రకాష్‌రాజ్ మాట్లాడుతూ,'నాలుగైదు రోజుల నుంచి మీడియాలో వస్తున్న ఊహాగానాలు చూస్తుంటే కొంచెం భయం వేసింది. 'మా' ఎన్నికల్లో రాజకీయ నాయకులు కూడా భాగమవుతున్నారంటూ వార్తలు వచ్చాయి. 'మా'లో పోటీ చేయాలనేది ఒక్కరోజులో తీసుకున్న నిర్ణయం కాదు. రెండేళ్ల నుంచే ఆలోచిస్తున్నాను. గడిచిన ఏడాది కాలం నుంచి ప్యానెల్లో ఎవర్నీ తీసుకోవాలి?, 'మా' సమస్యలు పరిష్కరించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అని ప్రణాళిక సిద్ధం చేసుకున్నాను. మాది సిని'మా' బిడ్డల ప్యానెల్. పదవీ కోసం మేం పోటీ చేయడం లేదు. పనిచేయడం కోసం పోటీచేస్తున్నాం. నా ప్యానెల్లో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రశ్నించేవాళ్లే. ఆఖరికి తప్పు చేస్తే, నన్ను కూడా వాళ్లు ప్రశ్నిస్తారు. ఫలానా వాళ్ళు ఫలానా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారంటూ దయచేసి రాయకండి. ఎందుకంటే మోహన్‌బాబు, చిరంజీవి, నాగార్జున.. ఇలా ప్రతిఒక్కరిదీ ఒక్కటే తపన.. 'మా'ని అభివద్ధి చేయడమే. కళాకారులు లోకల్ కాదు యూనివర్సల్. కళాకారులు వెలుగులాంటి వాళ్లు. భాషతో వాళ్లకు సంబంధం ఉండదు. గతేడాది ఎన్నికల్లో రాని నాన్‌లోకల్ అనే అంశం ఇప్పుడు ఎందుకు వచ్చింది?, నా అసిస్టెంట్స్‌కి ఇళ్లు కొని ఇచ్చినప్పుడు నాన్‌లోకల్ అనలేదు. రెండు గ్రామాలు దత్తత తీసుకున్నప్పుడు నాన్ లోకల్ అనలేదు. తొమ్మిది నందులు తీసుకున్నప్పుడు, జాతీయ అవార్డు పొందినప్పుడు నాన్‌లోకల్ అనలేదు. అలాంటిది ఇప్పుడు నేను నాన్‌లోకల్ అని ఎలా అంటున్నారు?, ఇది చాలా సంకుచితమైన మనస్తత్వం. 'మా' ఎంతో బలమైన అసోసియేషన్. ఇది కోపంతో పుట్టిన ప్యానల్ కాదు. ఆవేదనతో పుట్టింది. అర్హత చూసి ఓటు వేయండని ఆర్టిస్టులందర్ని రిక్వెస్ట్ చేస్తున్నా. 'మా' బాగు కోసం ప్రణాళికలు సిద్ధం చేశాం. ప్రతిదానికి లెక్కలు చూపిస్తాం. మీరందరూ ఆశ్చర్యపడేలా పనిచేస్తాం. ఎన్నికల విషయమై ప్రతిరోజూ సినీ పెద్దలతో మాట్లాడుతున్నాం. ఎలక్షన్ డేట్ ప్రకటించేంత వరకూ మా ప్యానల్లోని ఎవరూ కూడా మీడియా ముందుకు రారు' అని చెప్పారు.
ఈ సమావేశంలో ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులైన నాగబాబు, బండ్ల గణేష్, శ్రీకాంత్, బెనర్జీ, ప్రగతి, అనసూయ, సన, అజరు, నాగినీడు, సమీర్, ఉత్తేజ్, శివారెడ్డి, సురేష్ కొండేటి, సుడిగాలి సుధీర్‌తోపాటు వీడియో రూపంలో జయసుధ, సాయికుమార్ తదితరులు 'మా' కోసం ప్రకాష్‌రాజ్ రూపొందించిన విజన్ నచ్చి సపోర్ట్ చేస్తున్నట్టు తెలిపారు.