Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'తెలుగు సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న కష్టనష్టాలు, సమస్యలు నాకు బాగా తెలుసు. అలాగే 'మా' పరిస్థితీ తెలుసు. నాకు, నా కుటుంబానికి ఎంతో పేరు, ప్రతిష్టలు అందించిన తెలుగు సినిమా పరిశ్రమకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఆ రుణం తీర్చుకోవడానికి ఈ పరిశ్రమకు సేవ చేయడం నా కర్తవ్యంగా భావిస్తూ 'మా' అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నాను' అని హీరో మంచు విష్ణు తెలిపారు. త్వరలో జరగబోయే 'మా' (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం ప్రకాష్‌రాజ్ కూడా బరిలోకి దిగుతున్నారు. హేమ, జీవిత సైతం పోటీలో పాల్గొనే అవకాశం ఉంది. లేటెస్ట్గా సీనియర్ నటుడు సి.వి.ఎల్. నరసింహారావు కూడా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నట్టు ఆదివారం ప్రకటించారు. ఈ నేపథ్యంలో తానెందుకు అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నాననే విషయాన్ని ఓ లేఖ రూపంలో మంచు విష్ణు తెలిపారు. 'ఈ ఏడాది జరగనున్న 'మా' అధ్యక్ష పదవికి నేను నామినేషన్ వేస్తున్నాను. సినిమా పరిశ్రమనే నమ్ముకున్న కుటుంబంలో పుట్టిన నేను తెలుగు సినిమాతోనే పెరిగాను. మన పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, కష్టనష్టాలు.. ప్రత్యక్షంగా చూస్తూ పెరిగిన నాకు 'మా' కుటుంబ సభ్యుల భావాలు, బాధలు బాగా తెలుసు. నా తండ్రి మోహన్‌బాబు 'మా'కు అధ్యక్షుడిగా చేసిన సేవలు, వారి అనుభవాలు, నాయకత్వ లక్షణాలు ఇప్పుడు నాకు మార్గదర్శకాలయ్యాయి. గతంలో 'మా'కి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేసినప్పుడు 'మా' బిల్డింగ్ ఫండ్‌కి మా కుటుంబం తరఫున నిర్మాణానికి అయ్యే ఖర్చులో 25 శాతం అందిస్తానని మాట ఇచ్చాను. భవన నిర్మాణం ఇంకా ప్రారంభం కాలేదు. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా నేను ఇచ్చిన సలహాలు, సూచనలు దిగ్విజయంగా అమలు చేశాను. 'మా' వ్యవహారాలన్నింటినీ అతి దగ్గరగా, జాగ్రత్తగా పరిశీలించిన నాకు 'మా' కుటుంబ సభ్యులకు ఏది అవసరమో స్పష్టమైన అవగాహన, అనుభవం ఉంది. కష్టాల్లో ఉన్న కళాకారులకు ఎప్పుడూ అండగా ఉంటాం. అందుబాటులో ఉంటాం. పెద్దల అనుభవాలు, యువరక్తంతో నిండిన కొత్త ఆలోచనలు కలగలిపి నడవాలనే నా ప్రయత్నం, మీ అందరి సహకారంతో విజయవంతం కావాలని ఆశిస్తున్నాను' అని మంచు విష్ణు లేఖలో పేర్కొన్నారు.