Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సెకండ్ వేవ్ సద్దుమణిగినా థర్డ్ వేవ్ (డెల్టా వేరియంట్) రూపంలో ఇప్పుడిప్పుడే కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం మరోసారి థియేటర్లని మూసివేయమని ప్రకటించింది. ఈ కేసులు ఉధృతమైతే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ థియేటర్లు తెరుచుకునే అవకాశం ఉండదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని టాలీవుడ్ నిర్మాతలు తమ సినిమాలను ఓటీటీల్లో రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా నితిన్ నటించిన 'మాస్ట్రో' చిత్రాన్ని దాదాపు 40 కోట్ల రూపాయల డీల్‌తో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌కి నిర్మాతలు అమ్మినట్టు తెలుస్తోంది. అలాగే వెంకటేష్ నటిస్తున్న రెండు సినిమాలు 'నారప్ప', 'దృశ్యం 2' కూడా డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ కాబోతున్నాయని సమాచారం. వెంకీ సొంత సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ రెండు చిత్రాలకు కలిపి ఏకంగా రూ.70 కోట్ల బిజినెస్ జరిగిందని టాక్. ఈ రెండు సినిమాలతో పాటు ఇదే సంస్థ రానాతో నిర్మించిన 'విరాటపర్వం' చిత్రాన్ని సైతం అమెజాన్ ప్రైమ్ సంస్థ ఫ్యాన్సీ ఆఫర్‌తో విడుదల హక్కుల్ని దక్కించుకుందట. వెంకటేష్, నితిన్ సినిమాల మాదిరిగానే మరికొన్ని చిత్రాలూ ఓటీటీలో ప్రత్యక్షం కాబోతున్నాయి.