Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా ఫస్ట్‌వేవ్ టైమ్‌లో థియేటర్లలో సినిమాల్ని రిలీజ్ చేసి, యావత్ భారతీయ చిత్ర పరిశ్రమకు తెలుగు సినిమా ధైర్యాన్నిచ్చింది. జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో తెలుగు సినిమాల విడుదల పరంపర ఫుల్ జోష్‌లో ఉంది. అయితే సెకండ్ వేవ్ ఉధృతితో పరిస్థితి అంతా తారుమారైంది. ఏప్రిల్, మే, జూన్ నెలలు ఎటువంటి మెరుపులు లేకుండా ముగిసి పోయాయి. విలువైన వేసవి వినోదం ఆవిరైపోయింది. కరోనా సహవాసంతో తెలుగు సినిమా చేసిన ఆరు నెలల ఒడిదుడుకుల ప్రయాణం గురించి ఓ లుక్కేద్దాం..
3 నెలలు.. 100 సినిమాలు
కరోనా ఫస్ట్ వేవ్ టైమ్‌లో ప్రేక్షకులు థియేటర్లకు వస్తారో.. రారో అనే సందేహంతో దేశ వ్యాప్తంగా అన్ని చిత్ర పరిశ్రమలు ఉన్నాయి. ఇటువంటి విపత్కర పరిస్థితిలో తెలుగు సినిమా ధైర్యం చేసి, సినిమాలను థియేటర్లలో రిలీజ్ చేసింది. ఊహించని రీతిలో ప్రేక్షకులు థియేటర్లకు వచ్చారు. దీంతో తెలుగు సినిమాల విడుదల పరంపర ట్రాక్ ఎక్కేసింది. జనవరి, ఫిబ్రవరి, మార్చి..
ఈ మూడు నెలల్లో దాదాపు 100కి పైగా సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చి అదృష్టాన్ని పరీక్షించుకున్నాయి. మెప్పించే కంటెంట్ ఉంటే ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ విజయం తథ్యమని కొన్ని సినిమాలు నిరూపిస్తే, మరికొన్ని యథాలాపంగా ఫ్లాప్ బాట పట్టాయి. సినిమా చరిత్ర ఆరంభమైనప్పట్నుంచి సక్సెస్ శాతం ఎప్పుడూ తక్కువే. ఇదే పంథాలో ఈ మూడు నెలల్లో కూడా వేళ్ళ మీద లెక్కపెట్టే సినిమాలు మాత్రమే విజయాన్ని సాధించాయి.
సంశయంతో సాగిన సంక్రాంతి సందడి
పెద్ద పండగలాంటి సంక్రాంతి సీజన్ ఎటువంటి సందడి లేకుండా ముగిసింది. కరోనా కారణంగా మునుపటిలా ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా లేదా అనే అనుమానంతో అగ్రహీరోలు వెనకడుగు వేశారు. ఈ సంశయంతో సాగిన సంక్రాంతి బరిలో కేవలం రవితేజ నటించిన 'క్రాక్' మాత్రమే సక్సెస్ సాధించింది.
ఫిబ్రవరిలో రిలీజైన 'ఉప్పెన' విశేష ప్రేక్షకాదరణతో కాసుల వర్షం కురిపిస్తే, 'నాంది' విమర్శకుల ప్రశంసల్ని సొంతం చేసుకుని హిట్ సిినిమాగా నిలిచింది. ఈ సినిమాని అజరు దేవగన్ హిందీలో రీమేక్ చేస్తుండటం విశేషం.
మార్చిలో రిలీజైన 'జాతిరత్నాలు' సినిమా సైతం అపూర్వ ఆదరణ పొందింది. అతి తక్కువ బడ్జెట్‌తో రూపొంది ఏకంగా 70 కోట్ల రూపాయల్ని రాబట్టి పెద్ద సినిమా స్థాయిలో విజయాన్ని ఖాతాలో వేసుకుంది.
ఆవిరైన వేసవి వినోదం
సినిమా వాళ్ళకు సమ్మర్ సీజన్ చాలా చాలా ముఖ్యం. కొంత తెరిపిచ్చి కరోనా మళ్ళీ ఉధృతం అవుతున్న తరుణంలో పవన్‌కళ్యాణ్ నటించిన 'వకీల్‌సాబ్' రిలీజైంది. కోర్టు రూమ్ డ్రామాతో అలరించిన ఈ సినిమా గ్రాండ్ సక్సెస్‌ని సొంతం చేసుకుంది. ఏప్రిల్ మూడో వారం నుంచి సెకండ్ వేవ్ విలయతాండవం షురూ అవ్వడంతో వేసవి వినోదం ఆవిరైపోయింది.
అంచనాలు తారుమారు
భారీ అంచనాలతో రిలీజైన రామ్ 'రెడ్', బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 'అల్లుడు అదుర్స్', మంచు విష్ణు 'మోసగాళ్ళు', రానా 'అరణ్య', నితిన్ 'రంగ్ దే', 'చెక్', శర్వానంద్ 'శ్రీకారం', కార్తీకేయ 'చావు కబురు చల్లగా', దర్శకుడు అనిల్ రావిపూడి నిర్మాతగా మారి నిర్మించిన 'గాలి సంపత్' వంటి తదితర సినిమాలతో పాటు 'మాస్టర్', 'పొగరు', 'యువరత్న', 'రాబర్ట్', 'మిడ్నైట్ మర్డర్స్', 'ట్రాన్స్', 'అనుకోని అతిథి' వంటి తదితర అనువాద చిత్రాలు సైతం మెప్పించలేకపోయాయి.
ఓటీటీలోనూ నిల్
సెకండ్ వేవ్ దృష్ట్యా పలు ఓటీటీ వేదికల ద్వారా రిలీజైన సినిమాల్లో ఒక్కటీ కూడా ప్రేక్షకుల్ని అలరించలేదు. అగ్ర నిర్మాణ సంస్థలు నిర్మించిన 'ఏక్ మినీ కథ', 'సినిమా బండి', 'మెయిల్', 'అర్ధ శతాబ్దం' వంటి తదితర చిత్రాలు ప్రయోగాత్మక చిత్రాలుగా ప్రశంసలు పొందటం విశేషం.
కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ వెరసి.. ఆర్థికంగా నిర్మాతలను తీవ్రంగా దెబ్బతీశాయి. రెండో అర్ధభాగంలోనైనా థియేటర్లు ఓపెనై ప్రేక్షకులకు వినోదాన్ని పంచాలని, తద్వారా నిర్మాతలకు కాసిన్ని కాసులు రావాలని, మొత్తంగా తెలుగు సినిమా మునపటి జోష్‌లో ఉండాలని ఆశిద్దాం.