Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అటు బాలీవుడ్.. ఇటు టాలీవుడ్ సినీ ప్రముఖులకు సంబంధించి ఆందోళనకర, విషాదభరిత వార్తలతో సాగిన బుధవారాన్ని అత్యంత బాధాకరమైన రోజుగా నెటిజన్లు అభివర్ణించారు.
బాలీవుడ్ సీనియర్ నటుడు దిలీప్‌కుమార్ మరోసారి ఆస్పత్రిలో చేరారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో బుధవారం ఉదయం ఆయన్ని కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేర్పించినట్లు సన్నిహిత వర్గాలు తెలిపారు. ప్రస్తుతం ఐసీయూలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ నెల 6వ తేదీన శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తడంతో దిలీప్ కుమార్ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. చికిత్స అనంతరం ఇంటికి వెళ్ళారు. అయితే మళ్ళీ 15 రోజుల తర్వాత ఆయన ఆస్పత్రిలో చేరడంతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు. వయసురీత్యా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న దిలీప్‌కుమార్ 1998లో విడుదలైన 'ఖిల్లా' తర్వాత వెండితెరపై కనిపించలేదు.
మరో ప్రముఖ బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షా న్యుమోనియాతో బాధపడుతూ ముంబైలోని ఆస్పత్రిలో చేరారు. గత రెండురోజులుగా న్యూమోనియాతో బాధపడుతున్న ఆయన్ని మంగళవారం హాస్పిటల్లో చేర్పించామని, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగుందని నసీరుద్దీన్ భార్య రత్నా పథక్ తెలిపారు. నసీరుద్దీన్ షా చికిత్సకు బాగానే స్పందిస్తున్నారని, ఆయన భార్య, కుమారుడు వివాన్ సహా కుటుంబమంతా ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
సీనియర్ నటి కవిత కొద్ది రోజుల తేడాతోనే కొడుకుని, భర్తని పోగొట్టుకోవడం అత్యంత విషాదభరితం. ఆమె భర్త దశరథ రాజు బుధవారం ఉదయం కన్నుమూశారు. మూడు వారాల క్రితం ఆయనకు కరోనా పాజిటివ్ రావడంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచారు. అలాగే రెండు వారాల క్రితం కవిత తనయుడు సాయి స్వరూప్ కూడా కరోనాతో మరణించారు. పలువురు సినీ ప్రముఖులు ఆమెకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఆమె బాధపడుతున్న తీరుని చూసి అందరూ కన్నీటిపర్యంతం అయ్యారు.
బాలీవుడ్ సినీయర్ నటి, యాంకర్ మందిరా బేడీ ఇంట విషాదం నెలకొంది. ఆమె భర్త, దర్శక, నిర్మాత రాజ్ కౌశల్ (49) గుండెపోటుతో బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. 'ప్యార్ మే కభీ కభీ', 'షాదీ కా లడ్డూ', 'ఆంటోనీ కౌన్ హై' వంటి తదితర చిత్రాలకు రాజ్ దర్శకత్వం వహించారు. అలాగే పలు సినిమాలను నిర్మించి అభిరుచిగల నిర్మాతగానూ ప్రత్యేకత సొంతం చేసుకున్నారు. దర్శక, నిర్మాతగానే కాకుండా స్టంట్ డైరెక్టర్‌గానూ ఆయన మంచి గుర్తింపు పొందారు. ఓ బాబుకి జన్మనిచ్చినప్పటికీ ఓ పాపని దత్తత తీసుకుని రాజ్, మందిరా దంపతులు తమ ఔదార్యం చాటుకున్నారు.