Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సాయి రోనక్, అవికా గోర్ జంటగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ యాడ్ ఫిల్మ్ మేకర్ మురళీ నాగ శ్రీనివాస్ గంధం దర్శకుడు. 'నెపోలియన్' సినిమాతో ప్రేక్షకుల మన్ననలు, విమర్శకుల ప్రశంసలూ సొంతం చేసుకున్న ఆచార్య క్రియేషన్స్ అధినేత భోగేంద్రగుప్తా మదుపల్లి ప్రొడక్షన్ నెం.3గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అవికా స్క్రీన్ క్రియేషన్స్ నిర్మాణ సంస్థను స్థాపించిన అవికా గోర్, ఎం.ఎస్. చలపతిరాజు సహ నిర్మాతలు. ఈ చిత్రానికి 'పాప్ కార్న్' అనే టైటిల్ని ఖరారు చేశారు. బుధవారం అవికా గోర్ పుట్టినరోజు సందర్భంగా టైటిల్ని ప్రకటించడంతో పాటు టైటిల్ మోషన్ పోస్టర్ని చిత్ర యూనిట్ విడుదల చేసింది.
ఈ సందర్భంగా భోగేంద్రగుప్తా మదుపల్లి మాట్లాడుతూ, 'మా కథానాయిక అవికా గోర్కి జన్మదిన శుభాకాంక్షలు. సరికొత్త కథ, కథనాలతో రూపొందుతున్న చిత్రమిది. అవికా గోర్ నిర్మాణ భాగస్వామ్యంలో ఈ సినిమా చేస్తుండటం చాలా సంతోషంగా ఉంది. కథానుగుణంగా 'పాప్ కార్న్' టైటిల్ని పెట్టాం' అని చెప్పారు. 'మెలో డ్రామా జోనర్లో తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఒకరిపై మరొకరికి విపరీతమైన ద్వేషం ఉన్న ఓ అమ్మాయి, ఓ అబ్బాయి అనుకోకుండా తప్పించుకోవడానికి వీలులేని పరిస్థితిలో చిక్కుకుంటారు. తప్పించుకోవడానికి వీలు లేని ఓ చోటులో ఆ ఇద్దరూ ఎలా టైమ్ పాస్ చేశారు?, ఓ ప్రమాదకరమైన పరిస్థితి వచ్చాక ఏం చేశారు?, ఆ తర్వాత ఏమైందనేది కథ' అని దర్శకుడు మురళీ నాగ శ్రీనివాస్ గంధం తెలిపారు. ఈ చిత్రానికి ఎడిటర్: కార్తీక్ శ్రీనివాస్, మ్యూజిక్: శ్రవణ్ భరద్వాజ్.