Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏ చిత్ర పరిశ్రమ మనుగడకైనా చిన్న చిత్రాలే ముఖ్య కారణం. అలాంటి చిన్న చిత్రాలు దేశ వ్యాప్తంగా అన్ని చిత్ర పరిశ్రమల్లోనూ విడుదలకు తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా కరోనా కారణంగా థియేటర్లు మూతపడటంతో ఈ సమస్య మరింత తీవ్రంగా మారింది. గత ఏడాది నుంచి ఇప్పటివరకు ఎన్నో సినిమాలు ల్యాబ్స్‌కే పరిమితమైపోయాయి. దీంతో ఈ చిత్రాలను నిర్మించిన నిర్మాతలు ఆర్థికంగా బాగా నష్టపోతున్నారు. ఈ సమస్యను క్షుణ్ణంగా పరిశీలించిన కేరళ సర్కార్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. విడుదలకు ఇబ్బంది పడుతున్న చిత్రాల కోసం ప్రభుత్వం తరఫున ఓ సొంత ఓటీటీ (ఓవర్ ది టాప్) సంస్థను ఏర్పాటు చేయనుంది. ఈ విషయాన్ని కేరళ సాంస్కృతిక శాఖామంత్రి సాజీ చేరన్ ప్రకటించారు. సొంత ఓటీటీ సంస్థ లేదా ఇప్పటికే బాగా పాపులర్ అయిన ఏదైన ఓ ఓటీటీ సంస్థను ప్రభుత్వం తీసుకునే అవకాశం ఉందని, దీని వల్ల పలు మలయాళ చిత్రాల విడుదలకు ఉన్న సమస్య తీరుతుందని ఆయన తెలిపారు. చిన్న సినిమాలు, చిన్న నిర్మాతల విషయంలో కేరళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అద్భుతమని దేశ వ్యాప్తంగా పలువురు చిత్ర ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురిపించారు. సొంత ఓటీటీ ద్వారా విడుదలయ్యే ఎన్నో చిన్న చిత్రాలను ప్రేక్షకులు చూసే అవకాశం పుష్కలంగా ఉంటుందని, అలాగే ఆర్థికంగా చిన్న నిర్మాతలకు కొండంత అండగా ఉంటుందనే అభిప్రాయాన్నీ సినీ ప్రముఖులు వ్యక్తం చేశారు. ఆగస్ట్‌లో జరగబోయే ఓనమ్ పండగ నేపథ్యంలో సొంత ఓటీటీని నిర్మాతలకు అందుబాటులోకి తీసుకురావాలనే యోచనలో కేరళ ప్రభుత్వం ఉంది.