Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఓటీటీల్లో సినిమాలను రిలీజ్ చేద్దామనుకుంటున్న నిర్మాతలు దయచేసి.. అక్టోబర్ వరకు ఆగండి. అప్పటికీ థియేటర్లు ఓపెన్ కాకపోతే మీ సినిమాలను ఓటీటీల్లో రిలీజ్ చేయండి' అని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్(టీఎస్ఎఫ్సీసీ) నిర్మాతల్ని కోరింది. ప్రస్తుతం ఉన్న కోవిడ్ పరిస్థితులు సాధారణ స్థితికి వస్తున్నాయి. అయినప్పటికీ కొన్ని కారణాల వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు ఓపెన్ కాలేదు. దీంతో పలువురు నిర్మాతలు తమ సినిమాలను ఓటీటీల వేదికగా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఓటీటీల్లో సినిమాలను రిలీజ్ చేస్తే థియేటర్ వ్యవస్థ తీవ్ర ఇబ్బందులు పడుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని శనివారం టీఎస్ఎఫ్సీసీ ఆధ్వర్యంలో మురళీమోహన్ అధ్యక్షతన సమావేశమైన నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్టిబ్యూటర్లు అందరూ థియేటర్లు తెరిచే వరకూ సినిమాలను ఓటీటీలో విడుదల చేయరాదని ఏకగ్రీవంగా తీర్మానించారు. కరోనా పరిస్థితులు చక్కబడుతుండటంతో షూటింగ్‌లు మళ్లీ మొదలయ్యాయి. అయితే థియేటర్లు ఇంకా తెరుచుకోలేదు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న సినిమాల రిలీజ్ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. దీంతో పలువురు నిర్మాతలు ఓటీటీలను ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎగ్జిబిటర్స్‌తో తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సమావేశం నిర్వహించింది. ఓటీటీ వేదికగా తమ సినిమాలను విడుదల చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్న నిర్మాతలు ఈ ఏడాది అక్టోబరు వరకూ వేచి చూడాలని, అప్పటికీ థియేటర్లు తెరవకపోతే వారి ఇష్ట ప్రకారం ఓటీటీలో సినిమాలు రిలీజ్ చేసుకోవాలని కోరింది. ఇదే సమయంలో నిర్మాతలెవరైనా మండలి నిర్ణయాన్ని కాదని ఓటీటీలో సినిమాలను విడుదల చేస్తే, తమ భవిష్యత్ కార్యాచరణను త్వరలోనే వెల్లడిస్తామనీ హెచ్చరించింది. అదే విధంగా సినిమా టికెట్ల ధర విషయంలో ఏపీ ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునః పరిశీలించుకోవాలని టీఎస్ఎఫ్సీసీ విజ్ఞప్తి చేసింది. టికెట్ ధరలు తక్కువగా ఉండటం వల్ల థియేటర్స్, ఎగ్జిబిటర్ల మనుగడకు సమస్య అవుతుందని, చాలామంది ఉపాధిని కోల్పోతారని కూడా ఆందోళన వ్యక్తం చేసింది.అలాగే ఈనెల 7న తెలుగు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించాలని టీఎస్ఎఫ్సీసీ నిర్ణయించింది.