Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భిన్న కారణాలతో ఓ సినీ జంట విడిపోతున్నట్టు, మరో జంట పెళ్ళి రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించడంతో సోషల్ మీడియా వేదికగా ఇదొక పెద్ద చర్చనీయాంశమైంది. బాలీవుడ్ స్టార్ అమీర్‌ఖాన్, కిరణ్‌రావు జంట తమ 15 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి చెబుతున్నట్లు శనివారం అధికారికంగా ప్రకటిస్తే, భవ్య బిష్ణోరుతో తన పెళ్ళి జరగటం లేదని కథానాయిక మెహరీన్ సామాజిక మాధ్యమం ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంది.
'మా 15 ఏండ్ల వైవాహిక బంధం.. జీవిత కాలానికి సరిపడా ఎన్నో చిరునవ్వులు, ఆనందాలు, సంతోషాలను అందించింది. ప్రేమ, నమ్మకం, గౌరవంతో మా బంధం మరింత బలపడింది. ఇప్పుడు మా జీవితాల్లో సరికొత్త అధ్యాయాన్ని ఆరంభించాలని నిర్ణయించుకున్నాం. విడాకులు తీసుకోవడానికి, కొత్త ప్రయాణాన్ని ఆరంభించడానికి ఇదే సరైన సమయంగా మేము భావిస్తున్నాం. మా కుమారుడు ఆజాద్‌కి తల్లిదండ్రులుగా బాధ్యతలను ఉమ్మడిగా చూసుకుంటాం' అని అమీర్ దంపతులు తెలిపారు.
ఇటీవల హరియానా మాజీ ముఖ్యమంత్రి భజన్‌లాల్ మనవడు భవ్య బిష్ణోరుతో నాయిక మెహరీన్‌కి పెళ్లి కుదిరింది. జైపూర్ వేదికగా గత మార్చిలో నిశ్చితార్థం కూడా ఘనంగా జరిగింది. కాగా ఆ నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నట్లు మెహరీన్ స్వయంగా ట్విటర్ ద్వారా ప్రకటించారు. ఇరువురు ఇష్టపూర్వకంగా ఈ నిర్ణయానికి వచ్చినట్లు ఆమె తెలిపారు. ఇక నుంచి భవ్య బిష్ణోరు, అతని కుటుంబ సభ్యులతో ఎలాంటి సంబంధం ఉండబోదని కూడా స్పష్టం చేశారు. తన వ్యక్తిగత గోప్యతను అందరూ గౌరవిస్తారని, ఇక నుంచి తన అభిమానులను అలరించేందుకు సినిమాలు చేస్తానని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం 'ఎఫ్3'లో మెహరీన్ నటిస్తోంది.