Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'థి¸యేటర్ అనుభూతిని ఏ ఓటీటీ, ఏ ఏటీటీ ఫ్లాట్‌ఫామ్ కూడా ఇవ్వలేదు. ఎప్పటికీ థియేటర్లే కింగ్. కానీ కరోనా వల్ల కొంతమంది నిర్మాతలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి టైమ్‌లో వాళ్ళ సినిమాలను ఓటీటీల్లో రిలీజ్ చేయటం తప్పులేదు అనేది నా అభిప్రాయం' అని అంటున్నారు నిర్మాత ఎస్.కె.ఎన్. 'ఈ రోజుల్లో..' చిత్రంతో నిర్మాతగా ఆయన జర్నీ ఆరంభమైంది. విజరు దేవరకొండతో చేసిన 'టాక్సీవాలా' హిట్‌తో అభిరుచిగల నిర్మాతగా తనకంటూ ఓ ప్రత్యేకత సొంతం చేసుకున్నారు. బుధవారం తన పుట్టినరోజు నేపథ్యంలో ప్రస్తుతం చేస్తున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌ల గురించి మంగళవారం మీడియాతో ఎస్కెఎన్ షేర్ చేసుకున్నారు.
ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..
'జర్నలిస్ట్‌గా, అగ్ర హీరోలకు పీఆర్ఓగా నా కంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాను. ఆ తర్వాత మారుతి దర్శకుడిగా పరిచయమైన 'ఈ రోజుల్లో...'తో నిర్మాతగా నా ప్రయాణం మొదలైంది. విజరు దేవర కొండతో చేసిన 'టాక్సీవాలా'తో విజయవంతమైన నిర్మాతగా ఓ ముందడుగు వేశాను. 'భలే భలే మగాడివోరు', 'మహానుభావుడు', 'ప్రతిరోజూ పండగే' చిత్రాలకు సహ నిర్మాతగానూ చేశాను. అలాగే ప్రస్తుతం గోపీచంద్, మారుతి కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న 'పక్కా కమర్షియల్' చిత్రానికీ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నాను. దీంతోపాటు దర్శకుడు మారుతి అండ్ టీమ్ డైరెక్ట్ చేస్తున్న ఓ సినిమాని యూవీ క్రియేషన్స్‌తో కలిసి నిర్మిస్తున్నాను. రచయిత, దర్శకుడు, నిర్మాత సాయి రాజేష్ అసోసియేషన్‌తో మూడు సినిమాలు చేయబోతున్నాను. అలాగే 'కలర్‌ఫోటో' దర్శకుడు సందీప్‌రాజ్‌తో రెండు సినిమాలు ఉన్నాయి. 'టాక్సీవాలా' డైరెక్టర్ రాహుల్ సంకత్యాన్, వీఐ ఆనంద్, 'పలాస' ఫేమ్ కరుణ్ కుమార్‌లతోనూ సినిమాలు చేయబోతున్నాను. ఇవి కాకుండా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్ ఆహాలో 'త్రీ రోజేస్', జీ5, ఓ ఇంటర్నేషనల్ ఓటీటీ సంస్థలో ఓ వెబ్‌సిరీస్ చర్చలు తుదిదశలో ఉన్నాయి. ప్రతిభావంతులను ప్రొత్సహించాలనే ఉద్దేశంతో మారుతితో కలిసి మాస్ మూవీ మేకర్స్ అనే బ్యానర్‌ను స్టార్ట్ చేసి, వెబ్ కంటెంట్‌ను వ్యూయర్స్ ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం. నేను, మారుతి, బన్నీవాసు, యూవీవంశీ..మేం నలుగురం సినిమాల్లోకి రాకముందే మంచి మిత్రులం. మా భాగస్వామ్యాల విషయంలో క్రియేటివ్ డిఫరెన్స్‌లు ఉండవు. లెక్కల కంటే ముందు మేం స్నేహితులం. పైగా నిర్మాత అల్లుఅరవింద్‌గారి సలహాలు, సూచనలతో మేం ముందుకు వెళ్తున్నాం.
కరోనా కారణంగా థియేటర్లు మూతపడ్డాయి. థియేటర్ల వ్యవస్థ లేకపోతే స్టార్డమ్ తగ్గిపోయింది. థియేటర్ల మనుగడ బాగుంటే, ఇండిస్టీకి కూడా మేలు జరుగుతుంది. అయితే ఒక వ్యక్తిగా, ప్రేక్షకుడిగా, నిర్మాతగా నేను థియేటర్లలోనే సినిమా చూడ్డానికి ఇష్టపడతాను. ఒకసారి థియేటర్స్‌లో సినిమా ప్రదర్శితమైన తర్వాత ఓటీటీలో రిలీజ్ చేస్తేనే మంచిదని నా అభిప్రాయం. ఫస్ట్ వేవ్ లాక్డౌన్ తర్వాత థియేటర్లని రీ ఓపెన్ చేస్తే, ప్రేక్షకులు మునపటిలానే వచ్చారు. ఇప్పుడు కూడా అలాగే వస్తారని ఆశిస్తున్నాను. ప్రస్తుతం సినిమా ఆపరేటింగ్ కాస్ట్ కూడా చాలా పెరిగిపోయింది. నిత్యావసరాలు, పెట్రోలు మాదిరిగానే సినిమా టికెట్ ధరలూ పెరుగుతున్నాయి. సినీ పరిశ్రమకు ప్రభుత్వం ఇప్పటికే కొన్ని రాయితీలను ఇస్తోంది. అయితే ఇండిస్టీని ఓ పరిశ్రమలా కాకుండా కళగా గుర్తించి ప్రభుత్వం ప్రొత్సహించాలని కోరుకుంటున్నాం' అని ఎస్.కె.ఎన్. తెలిపారు.