Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లీప్కుమార్ ...
'ద అల్టిమేట్ మెథడ్ యాక్టర్'గా దిగ్దర్శకుడు సత్యజిత్ రే ప్రశంసలు అందుకున్న ఘనుడు. ఐదున్నర దశాబ్దాలుగా బాలీవుడ్‌ని ఏలిన ఎవర్గ్రీన్ లెజెండ్. అత్యంత సహజ నటనతో ప్రేక్షకుల మనసుల్లో సుస్థిర స్థానం సొంతం చేసుకున్న ట్రాజెడీ కింగ్. వహీదా రెహ్మాన్, మధుబాల, వైజయంతిమాల, నర్గీస్, మీనా కుమారి వంటి తదితర అలనాటి మేటి కథానాయికలతో ఆడిపాడిన గ్లామర్ హీరో. అత్యద్భుతమైన నటుడిగా, గాయకుడిగా దిలీప్‌కుమార్ కొనసాగించిన సినీ ప్రస్థాన విశేషాలు..
పాకిస్తాన్‌లోని పెషావర్‌లో 1922లో జన్మించిన దిలీప్ కుమార్ అసలు పేరు మహ్మద్ యూసుఫ్ ఖాన్. 12 మంది సంతానంలో దిలీప్ ఒకరు. తండ్రి పండ్ల వ్యాపారి. ఆయనతో కలిసి పండ్ల వ్యాపారం చేశారు. ముంబయిలోని ఆర్మీ క్లబ్లో క్యాంటీన్ నడుపుతున్న టైమ్‌లో బాంబే టాకీస్ యజమాని దేవికా రాణి ద్వారా 1250 రూపాయల జీతానికి బాంబే టాకీస్‌లో స్క్రిప్ట్ రైటర్‌గా పని చేశారు. అయితే ఆయనలో హీరో లక్షణాలు ఉండటంతో యూసఫ్ పేరును దిలీప్‌కుమార్‌గా మార్పు చేసి వెండితెరకు దేవికారాణి పరిచయం చేశారు.
తొలి చిత్రంతో పరాజయం
1944లో బాంబే టాకీస్ నిర్మించిన 'జ్వార్ భాటా' చిత్రంతో దిలీప్‌కుమార్ హీరోగా పరిచయం అయ్యారు. ప్రేక్షకుల నిరాదరణతో ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది. తొలి చిత్రంతో పరాజయం పొందటంతో నటుడిగా ప్రేక్షకుల్ని మెప్పించాలనే పట్టుదల దిలీప్కుమార్లో పెరిగింది. హాలీవుడ్ నటుడు జేమ్స్ స్టువర్ట్ని స్ఫూర్తిగా తీసుకుని నటనలో మెరుగులు దిద్దుకున్నారు. 1947లో వచ్చిన 'జుగ్ను' చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయనకు 1948లో విడుదలైన 'షాహీద్' సంచలన విజయం సాధించి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చింది.
ట్రాజెడీ కింగ్ ఇమేజ్
ఆ తర్వాత ఏడాది మెహబూబ్ ఖాన్ తెరకెక్కించిన 'షబ్నమ్' చిత్రంలో గ్రేట్ లెజెండరీస్ రాజ్‌కపూర్, నర్గీస్‌లతో కలిసి నటించారు. ఈ చిత్రం కూడా విజయకేతనం ఎగురవేయటంతో దిలీప్‌కి మరిన్ని అవకాశాలొచ్చాయి. 'అందాజ్', 'షబ్నమ్' 'ఆన్', 'దేవ్‌దాస్', 'మధుమతి' వంటి తదితర చిత్రాలు ఆయన్ని బాలీవుడ్లో అగ్రపథాన నిలిపాయి. విషాద నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రాలు ఆయన్నీ ట్రాజెడీ కింగ్‌గా మార్చాయి. 1950 - 60 సమయంలో ఎక్కువగా ట్రాజెడీ కథాంశాలతో, పాత్రలతో కూడిన చిత్రాల్లో నటించి ప్రేక్షకులతో కన్నీళ్ళు పెట్టించారు. అంతేకాదు పాత్రల్లో జీవించి నటించటం వల్ల ఆయన ఆరోగ్యం కూడా పాడైంది. సైక్రియాటిస్ట్ల సూచనతో తర్వాత కామెడీ చిత్రాల్లో నటించే ప్రయత్నం చేశారు. దిలీప్‌కుమార్ నటనా ప్రతిభను మెచ్చిన దిగ్దర్శకుడు సత్యజిత్ రే 'ద అల్టీమేట్ మేథడ్ యాక్టర్' అని ప్రశంసించారు. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోగానూ రికార్డు సృష్టించారు.
విజయవంతమైన చిత్రాలు
'షాహీద్', 'ముసాఫిర్', 'మేళా', 'బబుల్', 'జోగన్', 'అమర్' 'గంగా జమున', 'రామ్ ఔర్ శ్యామ్', 'బైరాగ్', 'కోహినూర్', 'లీడర్', 'ఆద్మీ', 'నయా దౌర్', 'గోపీ', 'ఆజాద్', 'మొఘల్ ఈ అజమ్', 'క్రాంతి', 'శక్తి', 'విధాత', 'మషాల్', 'కర్మ', 'దునియా', 'సౌదాఘర్' వంటి రొమాంటిక్, కామెడీ, హిస్టారికల్, యాక్షన్, ట్రాజెడీ చిత్రాల్లో తనదైన వైవిధ్య నటనతో ప్రేక్షకులను విశేషంగా అలరించారు. 1998లో విడుదలైన 'ఖిలా' దిలీప్‌కుమార్ నటించిన చివరి సినిమా.
అలనాటి మేటి కథానాయికలు
తన సినీ కెరీర్లో నటి వైజయంతిమాలతో కలిసి ఎక్కువ సినిమాల్లో నటించారు దిలీప్. అలాగే కామిని కౌషల్, మధుబాల, సైరాబాను, అస్మాలతో హిట్ పెయిర్ అనిపించుకున్నారు. నాటి స్టార్ హీరోలు మనోజ్‌కుమార్, శశికపూర్, సంజీవ్, షమ్మీ కపూర్లతో కలిసి నటించారు. 1976 నుంచి 81 వరకు దాదాపు ఐదేళ్ళపాటు ఒక్క చిత్రంలో కూడా నటించలేదు.
మంచి గాయకుడు కూడా
దిలీప్ నటుడే కాదు గాయకుడు కూడా. ఆయన సినిమాల్లోని పాటలు అద్భుతంగా ఉంటాయని చెప్పడానికి ఎన్నో సినిమాలు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తాయి. తలాట్ మహ్మద్, ముఖేష్, కిషోర్ కుమార్ల సినిమాలకు ప్లేబ్యాక్ సింగర్‌గా పలు పాటలు పాడారు. నౌషాద్, మహ్మద్ రఫీల్లో ఒకరు తన ఆత్మ సంగీతం, మరొకరు తన ఆత్మ స్వరం అని దిలీప్ చెప్పిన విషయం తెలిసిందే.
గిన్నిస్ బుక్‌లో స్థానం..
బాలీవుడ్ చిత్ర సీమలోనే అత్యధికంగా 8 సార్లు ఫిల్మ్ ఫేర్ అవార్డులను అందుకున్న ఏకైక నటుడు. 19 సార్లు ఫిల్మ్‌ఫేర్‌కు నామినేట్ అవ్వడంతో గిన్నిస్ బుక్‌లోనూ స్థానం సొంతం చేసుకున్నారు. అలాగే పాకిస్తాన్‌కు చెందిన అత్యంత ప్రతిష్టాత్మక పౌర పురస్కారం 'నిషాన్ ఈ ఇంతియాజ్'ను 1998లో అందుకున్నారు. అద్భుత నటనతోపాటు భారతీయ సినిమాకు చేసిన సేవలకు భారత ప్రభుత్వం 1991లో పద్మ భూషణ్, 1994లో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుతో, 2015లో పద్మ విభూషణ్ పురస్కారాలతో సముచితంగా గౌరవించింది. దిలీప్ కుమార్‌ని ఎన్టీఆర్ జాతీయ అవార్డు కూడా వరించింది.
బాలీవుడ్ చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న దిలీప్‌కుమార్ దాదాపు 60కి పైగా చిత్రాల్లో నటించారు. 'దిలీప్ కుమార్: ది సబ్‌స్టాన్స్ అండ్ ది షాడో' పేరుతో తన జీవిత చరిత్రను ఆవిష్కరించారు.
దిలీప్ కుమార్ నటించిన 'ఆన్' మొదటి టెక్నోకలర్ చిత్రం. తన సోదరుడు నజీర్ ఖాన్‌తో కలిసి 'గంగా జమున' చిత్ర నిర్మాణంలో తొలిసారి భాగస్వామి అయ్యారు. దిలీప్‌కుమార్ దర్శకత్వం వహించిన 'కళింగ' సినిమా అసంపూర్తిగా మిగిలిపోయింది. మహారాష్ట్ర నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున 2000- 2006 వరకు రాజ్యసభ సభ్యుడిగా ప్రజలకు సేవ చేసిన దిలీప్‌కుమార్ కన్నుమూతతో భారతీయ సినీ పరిశ్రమలో అజరామరమైన ఒక శకం ముగిసింది.