Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సినీ విశ్లేషకుడు, నటుడు కత్తి మహేష్ (44) ఇకలేరు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన చెన్నై అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. తల, శరీరంపై తీవ్ర గాయాలు అవడంతో వైద్యులు శస్త్రచికిత్స చేసినప్పటికీ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయన శనివారం తుదిశ్వాస విడిచారు. చిత్తూరు జిల్లాలో జన్మించిన కత్తి మహేష్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నత విద్యను పూర్తి చేశారు. సినిమాలకు దర్శకత్వం వహించాలనే ఆకాంక్షతో పలు ప్రయత్నాలు చేశారు. 2011లో దేవరకొండ బాలగంగాధర తిలక్ రచించిన 'ఊరు చివర ఇల్లు' కథ ఆధారంగా 'ఎడారివర్షం' అనే షార్ట్ ఫిల్మ్ తీశారు. సహ రచయితగా వ్యవహిరించిన 'మిణుగురులు' చిత్రం ఆస్కార్ లైబ్రరీలో స్థానం సొంతం చేసుకున్న తొలి తెలుగు సినిమా కావడం విశేషం. 'పెసరట్టు' చిత్రానికి దర్శకత్వం వహించారు. అలాగే నటుడిగా 'హదయకాలేయం', 'నేనే రాజు నేనే మంత్రి', 'కొబ్బరిమట్ట', 'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు', 'క్రాక్' తదితర చిత్రాల్లోనూ మెరిశారు. బిగ్‌బాస్ సీజన్-1లోనూ పాల్గొన్నారు. పలు టెలివిజన్ ఛానెళ్లు, యూట్యూబ్ వేదికగా సినిమాలను విశ్లేషించారు. నటుడిగా, దర్శకుడిగా, సినీ విశ్లేషకుడిగా కంటే వివాదస్పద వ్యాఖ్యల వ్యక్తిగా కత్తిమహేష్‌కి ఎక్కువ పాపులారిటీ ఉంది. పలు అంశాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఒకానొక సందర్భంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం హైదరాబాద్ పోలీసులు ఆరు నెలల పాటు కత్తి మహేష్‌ను నగర బహిష్కరణ కూడా చేశారు.