Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అల్లుఅర్జున్ ముద్దుల తనయ అర్హ వెండితెరపై మెరవబోతోంది. 'అల్లు' వారి వారసురాలిగా 'శాకుంతలం' చిత్రంతో ఎంట్రీ ఇస్తోంది. సమంత ప్రధాన పాత్రధారిణిగా గుణశేఖర్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా చిత్రంలో యువరాజు భరతుడి పాత్రలో అర్హ కనిపించనుంది. గురువారం అర్హ షూటింగ్లో పాల్గొంది. అర్హ పాల్గొనే సన్నివేశాల చిత్రీకరణను 10 రోజుల్లో పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
కూతురి సినీ రంగ ప్రవేశంతో అల్లుఅర్జున్ పట్టలేని సంతోషంలో ఉన్నారు. ఆ సంతోషాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసుకున్నారు. అల్లురామలింగయ్యతో 'అల్లు' వారి ప్రస్థానం ఆరంభమైంది. ఆ తర్వాత ఆయన తనయుడు అల్లుఅరవింద్, తర్వాత అల్లుఅరవింద్ తనయులు అల్లుఅర్జున్, అల్లు శిరీష్.. ఇలా మూడు తరాలు ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు అర్హతో నాలుగోతరం ప్రారంభమవ్వడం విశేషం. దిల్రాజు సమర్పణలో గుణా టీం వర్క్స్, దిల్ రాజు ప్రొడక్షన్స్ పతాకాలపై నీలిమా గుణ, హర్షితా రెడ్డి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.