Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'మా 'నారప్ప' చిత్రాన్ని థియేటర్లలో కాకుండా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నామని ఫ్యాన్స్‌తోపాటు ఎగ్జిబిటర్స్లోనూ చాలా అసంతృప్తి ఉంది. వాళ్ళతోపాటు నేను, వెంకటేష్ కూడా బాధపడుతున్నాం. ఇది మా సొంత సినిమా అయితే ఆలస్యమైనా థియేటర్లలోనే రిలీజ్ చేసేవాళ్ళం' అని నిర్మాత సురేష్‌బాబు చెప్పారు. వెంకటేష్, ప్రియమణి జంటగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'నారప్ప'. ధనుష్ హీరోగా తమిళ నాట సంచలన విజయం సాధించిన 'అసురన్' చిత్రాన్ని తెలుగులో 'నారప్ప'గా సురేష్‌బాబు, కలైపులి ఎస్.థాను సంయుక్తంగా రీమేక్ చేశారు. ఈనెల 20న ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది.
ఈ నేపథ్యంలో ఆదివారం నిర్మాత డి.సురేష్‌బాబు మీడియాతో మాట్లాడుతూ, 'తమిళ నిర్మాత కలైపులి ఎస్.థానుతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించాం. ఇటీవల ఆయన 'కర్ణన్' అనే సినిమాని విడుదల చేశారు. 100 శాతం ఆక్యూపెన్సీతో మొదటి వారం, 75 శాతం ఆక్యూపెన్సీతో రెండో వారం మాత్రమే థియేటర్లలో ఆ సినిమా ప్రదర్శితమైంది. కరోనా సెకండ్ వేవ్ ఉద్ధతి ఎక్కువ కావడంతో థియేటర్లు మూత బడ్డాయి. దాంతో ఆయనకు సుమారు రూ.15 కోట్ల నష్టం వచ్చింది. 'నారప్ప' విషయంలోనూ అలాగే జరుగుతుందోమోననే భయం మొదలైంది. అన్ని రకాలుగా ఆలోచించి చివరికి ఓటీటీలోనే రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యాం. ఈ నిర్ణయం వెంకటేష్ ఫ్యాన్స్‌తోపాటు ఎగ్జిబిటర్లుని ఎంతో బాధపెట్టింది. పరిస్థితుల వల్లే ఇలా చేయాల్సి వచ్చింది. అయితే కోవిడ్ రాని వాళ్లు ఒకలా ఆలోచిస్తుంటే, వచ్చిన వాళ్లు, వాళ్ల కుటుంబ సభ్యులు మరోలా ఆలోచిస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం తర్వాత మనమే మన కుటుంబ సభ్యుల్ని థియేటర్లకి పంపించనప్పుడు 'మా సినిమాకి రండి' అంటూ ఇతర కుటుంబాల్ని ఎలా అడుగుతాం?.
థియేటర్ వ్యవస్థలో మార్పులొస్తారు
అలాగే స్టార్ హీరోల చిత్రాలు ఓటీటీలో వస్తుంటే థియేటర్లు కనుమరుగయ్యే అవకాశం ఉంటుందనే మాటలు వినిపిస్తున్నాయి. అయితే పరిస్థితుల దృష్ట్యా థియేటర్ వ్యవస్థలో కొద్దిగా మార్పు వస్తుందేమో కానీ, కనుమరుగయ్యే అవకాశం ఉండదు. ప్రపంచంలోనే అతి పెద్ద నిర్మాణ సంస్థ డిస్నీనే థియేటర్లతో పాటు తమ చిత్రాల్ని ఓటీటీలోనూ విడుదల చేస్తోంది. పరిస్థితుల్ని బట్టి ప్రేక్షకుల అభిరుచి మారిందని ఆ సంస్థ ముందే గ్రహించి, అందుకు అనుగుణంగా కార్యచరణ చేపట్టింది.
ఇక 'అసురన్' చిత్రాన్ని రీమేక్‌గా ఎంపిక చేసుకోవడానికి కారణం ఒకటే, ఏ నటుడికైనా కొత్త తరహా పాత్రలు పోషించాలని ఉంటుంది. వెంకటేష్ అలాంటి పాత్రల కోసమే చూస్తుంటాడు. వెంకటేష్ 'అసురన్' సినిమా చూసి, బాగుంది.. నువ్వు కూడా చూడు అని చెప్పాడు. ఆ సినిమా చూసిన వెంటనే చేసేద్దాం అని చెప్పా. దర్శకుడు వెట్రిమారన్ వాస్తవికతని చూపిస్తూనే, కమర్షియల్ హంగుల్ని తీర్చిదిద్దిన విధానం నాకు చాలా బాగా నచ్చింది. వెంకటేష్‌కి పక్కా యాప్ట్ సినిమా అనిపించింది. మాస్ సినిమాలా ఉన్నప్పటికీ కుటుంబ నేపథ్యంలో సాగుతుంది. అలాగే ఓ మంచి సందేశమూ ఉంది. ఈ సినిమా రీమేక్ హక్కులు సొంతం చేసుకున్న టైమ్‌లో దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల చెప్పిన ఓ కథ అంతగా నచ్చలేదని చెప్పా. మీరు 'అసురన్' రీమేక్ చేస్తున్నారట కదా, దానికి ఇంకా దర్శకుడ్ని ఫైనల్ చేయకపోతే, నేను ఇంట్రెస్ట్‌గా ఉన్నా.. నేను చేస్తా అని శ్రీకాంత్ అడ్డాల అనడంతో నేను, వెంకటేష్ గ్రీన్‌స్నిగల్ ఇచ్చాం' అని చెప్పారు.