Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''నారప్ప' సినిమాకి ఎమోషన్సే చాలా కీలకం. దాన్ని మిస్ కాకుండా తెరకెక్కించడం నాకొక పెద్ద సవాల్‌గా అనిపించింది. ఇక 'నారప్ప'గా వెంకటేష్‌గారు పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు' అని దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల చెప్పారు. వెంకటేష్ హీరోగా నటించిన చిత్రం 'నారప్ప'. డి.సురేష్ బాబు, కలైపులి యస్.థాను నిర్మించిన ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు. ఈ నెల 20 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.
ఈ సందర్భంగా సోమవారం దర్శకుడు శీకాంత్ అడ్డాల మీడియాతో మాట్లాడుతూ, 'తమిళంలో 'అసురన్' సినిమా చూశాను. ఓసారి కథాచర్చల్లో భాగంగా నిర్మాత సురేష్‌బాబుని కలిసినప్పుడు 'అసురన్' రీమేక్ రైట్స్ తీసుకున్నారని తెలిసింది. డైరెక్టర్‌గా ఎవర్నైనా అనుకున్నారా? అని అడిగితే, ఆయన లేదన్నారు. నాకు ఆసక్తి ఉందని చెప్పడంతో డైరెక్టర్‌గా నన్ను ఆయన ఓకే చేశారు. 'నారప్ప' సినిమా కోసం 50 రోజుల లాంగ్ షెడ్యూల్ చేశాం. మన నేటివిటీ ఉండాలని అనంతపురంలో ఓ 10 రోజుల పాటు చిత్రీకరణ జరిపాం. ఆ తర్వాత మేజర్ చిత్రీకరణ మొత్తం 'అసురన్'ని తీసిన చోటే చేశాం. అలాగే మన తెలుగు ప్రేక్షకులు అభిరుచికి అనుగుణంగా ఒరిజినల్ వర్షెన్‌కి చిన్న చిన్న మార్పులు చేశాను. ఎమోషన్స్ పరంగా 'నారప్ప' చాలా సెన్సిబుల్ సినిమా. రీమేక్ అంటే ఒక్క కథ తప్ప, మిగతా కష్టం అలాగే ఉంటుంది. రీమేక్‌ను బాగా తీస్తే ఓకే, లేకపోతే ఉన్న సినిమాని ఉన్నట్లుగా కూడా తీయలేకపోయారని విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే రీమేక్ ఎప్పుడూ రిస్కే. 'అసురన్' సినిమాలోని ఎమోషన్ని 'నారప్ప' సినిమాలోనూ క్యారీ చేయడం నాకు చాలా ఛాలెంజింగ్‌గా అనిపించింది. పరిస్థితుల కారణంగా 'నారప్ప' ఓటీటీలో రిలీజ్ అవుతున్నందుకు నేనే కాదు.. వెంకటేష్‌గారు కూడా బాగా నిరుత్సాహపడ్డారు. 'నారప్ప' పాత్ర కోసం ఆయన బాగా కష్టపడ్డారు. పాత్రను ఓన్ చేసుకుని జీవించారు. సుందరమ్మ పాత్రలో ప్రియమణి కూడా అద్భుతంగా నటించారు. 'అసురన్'లాంటి సినిమాని తీసిన దర్శకుడు వెెట్రీమారన్ను అభినందించాల్సిందే. 'నారప్ప' సినిమా జర్నీ నాకొక మంచి అనుభూతినిచ్చింది. కథలో లోటుపాట్లు ఉండి, ప్రేక్షకులు కనెక్ట్ కాకపోతే సినిమా ఫెయిల్ అవుతుందే తప్ప, దర్శకుడు కాదు. నా నెక్ట్స్ ప్రాజెక్ట్ 'అన్నారు'. దీన్ని మూడు భాగాలుగా తీయాలనుకుంటున్నాను. 1970-1980 బ్యాక్‌డ్రాప్‌లో జరిగే పీరియాడికల్ చిత్రమిది. డిజిటల్ ఎంటర్టైన్మెంట్ వచ్చిన తర్వాత అందరికీ అవకాశాలు బాగానే ఉంటున్నాయి. అయితే ఆ అవకాశాలను ఎలా సద్వినియోగం చేసుకుంటున్నాం అనేదే ముఖ్యం' అని తెలిపారు.