Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రిషి, శిల్ప నాయక్, తేజు అనుపోజు, శివ కార్తీక్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'హనీ ట్రాప్'. సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో భరద్వాజ్ సినీ క్రియేషన్స్ పతాకంపై వి.వి. వామనరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రవీణ్ ఇమ్మడి సంగీతాన్ని అందించిన ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం బుధవారం ఫిలిం ఛాంబర్లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు ఆర్పీ మాట్లాడుతూ, 'సొసైటీకి అవసరం అయ్యే పాయింట్‌తో, కమర్షియల్‌గా సినిమాలు చేయడం సునీల్‌కుమార్ రెడ్డి ప్రత్యేకత. హనీ ట్రాప్ అనేది మన రియల్ లైఫ్‌లోనూ వింటుంటాం. గొప్ప పేరున్న వ్యక్తులు హనీ ట్రాప్‌లో పడి తమ పేరు పాడు చేసుకుంటారు' అని చెప్పారు. 'మంచి సినిమాతో త్వరలో మీ ముందుకు వస్తాం. హనీ వెనుక ట్రాప్ ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూస్తారు. ఈ సినిమా మంచి విజయం సాధించాలి' అని సంగీత దర్శకుడు రఘు కుంచె అన్నారు.
యెక్కలి రవీంద్ర బాబు మాట్లాడుతూ, 'ఈ చిత్రానికి నిర్మాత వామనరావు మంచి కథ, స్క్రీన్‌ప్లే అందించారు. అలాగే ఓ పాత్రలో నటించారు కూడా. ఈ సినిమాలో నాకు పాటల రాసే అవకాశం కలిగింది. పాటలు బాగా వచ్చాయి' అని చెప్పారు. నిర్మాత వివి వామనరావు మాట్లాడుతూ, 'నేను కథా రచయితగా ఎలా సినిమాని ఊహించుకున్నానో, అంతకన్నా బాగా సునీల్ కుమార్ రెడ్డి తెరకెక్కించారు. మా సినిమా ప్రివ్యూ చూసిన వాళ్లంతా చాలా బాగుందని ప్రశంసించారు. శ్రీలక్ష్మీ ఫిలింస్ బాపిరాజు మా సినిమాని డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నారు' అని తెలిపారు.
'నిర్మాత వామనరావు హనీట్రాప్ కథ చెప్పగానే, ఈ కథలో కమర్షియల్ మూవీకి కావాల్సిన విషయం ఉందనిపించింది. ఆడియెన్స్‌కి ఏం కావాలో చూసుకుంటూ, మా సెన్సిబిలిటీస్‌కు తగినట్లుగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. మా గత హిట్ చిత్రాల్లాగే ఈ సినిమా కూడా తప్పకుండా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది' అని దర్శకుడు పి.సునీల్ కుమార్ రెడ్డి అన్నారు. నటుడు శివ కార్తీక్ మాట్లాడుతూ,'సునీల్ కుమార్ రెడ్డి 'గల్ఫ్' సినిమాలో నటించాను. ఆయనతో ఇది నాకు రెండో సినిమా. ఇందులోనూ మంచి క్యారెక్టర్లో నటించే అవకాశం కల్పించారు' అని చెప్పారు.