Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఫ్రెండ్షిప్ డే సందర్భంగా 'ఆర్ఆర్ఆర్' చిత్ర బృందం విడుదల చేసిన 'దోస్తీ' పాట సర్వత్రా అనూహ్య ఆదరణ సొంతం చేసుకుంటోంది. స్నేహానికి ప్రతీకగా నిలిచిన ఈ పాట ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ సంగీత ప్రియులను విశేషంగా అలరిస్తోంది. కీరవాణి సారథ్యంలో హేమచంద్ర (తెలుగు), అమిత్ త్రివేది (హిందీ), అనిరుధ్ (తమిళం), యాజిన్ నిజార్ (కన్నడ), విజరు జేసుదాస్ (మలయాళం).. ఇలా ఐదు భాషలకు చెందిన ఐదుగురు గాయకులు ఈ పాటను హుషారెత్తించేలా ఆలపించారు. 'పులికి విలుగాడికి.. తలకి ఉరితాడుకి.. కదిలే కార్చిచ్చుకి.. కసిరే బడగళ్లకి.. రవికి మేఘానికీ.... 'దోస్తీ' ఊహించని చిత్రమే చిత్రం.. స్నేహానికి చాచిన హస్తం.. ప్రాణానికి ప్రాణం ఇస్తుందో తీస్తుందో.. ' అంటూ సాగే ఈ పాట 'ఆర్ఆర్ఆర్'లో ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ల మధ్య అత్యద్భుతమైన స్నేహాన్ని ప్రతిబింబించేలా ఉంది. భిన్న మనస్తత్వాలు గల వ్యక్తులకు స్నేహం కుదరడం.. చివరికి అది ఎటువైపునకు దారి తీస్తుంది అనేది ప్రధానాంశంగా 'ఆర్ఆర్ఆర్'లో చూపించినట్లు ఈ పాట చెప్పకనే చెబుతోంది. ప్రత్యేకంగా వేసిన ఓ సెట్లో కీరవాణి, హేమచంద్ర, అమిత్ త్రివేది, అనిరుధ్, యాజిన్ నిజార్, విజరు ఏసుదాస్పై చిత్రీకరించిన ఈ పాటలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ సైతం మెరిశారు. దీంతో అటు ఎన్టీఆర్, ఇటు రామ్‌చరణ్ అభిమానులు ఫుల్ ఖుషీలో ఉన్నారు. నిజ జీవితంలోనే కాకుండా సినిమాలోనూ తమ అభిమాన హీరోల స్నేహాన్ని నిర్వచించేలా ఈ పాట ఉందని సోషల్ మీడియా వేదికగా అభిమానులు కామెంట్ల వర్షం కురిపించారు.
అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్, కొమురంభీమ్‌గా ఎన్టీఆర్ నటిస్తున్న భారీ ఫిక్షనల్ పీరియాడిక్ చిత్రమిది. ఇందులో ఆలియాభట్, ఒలీవియా మోరీస్, శ్రియ, అజరు దేవ్గన్, సముద్రకనితోపాటు పలువురు ప్రముఖ నటీనటులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా 'దోస్తీ' పాటను విడుదల చేశారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై దానయ్య డీవీవీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.