Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జైహింద్ గౌడ్ ప్రధాన పాత్రధారిగా, ప్రియాంకని కథానాయికగా పరిచయం చేస్తూ రూపొందుతున్న చిత్రం 'దెయ్యాలున్నాయా?'. శ్రీ ప్రణరు ఆర్ట్ ఫిలిం బ్యానర్ పై ఎల్. విజరు మనోహర్‌రావు (త్రయోటెక్స్) సమర్పణలో కంకణాల శ్రీనివాస్‌రెడ్డి స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు.
ఈ సినిమా సోమవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. జైహింద్ గౌడ్, ప్రియాంకపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ఏలూరు సురేందర్ రెడ్డి క్లాప్ ఇవ్వగా, మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నరసింహ రెడ్డి స్విచాన్ చేశారు. భీమ్ రెడ్డి తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు.
ఈ సందర్భంగా దర్శక, నిర్మాత కంకణాల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, 'ప్రేతాత్మల కథాంశంతో తెరకెక్కిస్తున్న చిత్రమిది. నలుగురు కుర్రాళ్ళు, ఇద్దరు అమ్మాయిలు మెయిన్ లీడ్‌గా ఉంటారు. కామెడీ, హర్రర్, థ్రిల్లర్ నేపథ్యంలో ఓ ఆసక్తికరమైన కథాంశంతో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాం. 25 రోజుల్లో సింగిల్ షెడ్యూల్లో చిత్రాన్ని పూర్తి చేస్తాం. 'దెయ్యాలున్నాయా?' అనే టైటిల్ అందరిలోనూ అమితాసక్తి కలిగిస్తోంది. అందరికి నచ్చేలా, అన్ని రకాల కమర్షియల్ హంగులతో ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీపడకుండా నిర్మిస్తున్నాం. మిగతా నటీనటులను త్వరలోనే ఎంపిక చేస్తాం' అని అన్నారు. 'ఈ కథ బాగా నచ్చింది. ముఖ్యంగా ఇందులో నా పాత్ర బాగా నచ్చడంతో ఈ సినిమాలో చేసేందుకు అంగీకరించాను. ఇందులో ప్రొఫెసర్‌గా కనిపిస్తాను' అని జైహింద్ గౌడ్ తెలిపారు.
జై హింద్ గౌడ్, ప్రియాంక, గౌతమ్ రాజు, హేమసుందర్, రఘునాధ్ రెడ్డి, వంశీ మాదారపు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, కెమెరా, మాటలు, నిర్మాత, దర్శకత్వం : కంకణాల శ్రీనివాస్ రెడ్డి.