Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారతీయ వెండితెరపై మొట్ట మొదటిసారి ఒకే ఒక్క క్యారెక్టర్‌తో, ఎడిటింగ్ లేకుండా ఉత్కంఠ భరితంగా సాగిపోయే కథాకథనంతో తెరకెక్కుతున్న చిత్రం '105 మినిట్స్'. హన్సిక మోట్వాని కథానాయిక. రాజు దుస్సా దర్శకత్వంలో రుధ్రాన్ష్ సెల్యూలాయిడ్ పతాకం పై బొమ్మక్ శివ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరపడానికి చిత్రం బృందం సమాయత్తమవుతోంది. సోమవారం కథానాయిక హన్సిక పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రంలోని హన్సిక ఫస్ట్‌లుక్‌ను అగ్ర దర్శకుడు బాబీ విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'ఇదొక ప్రయోగాత్మక చిత్రం. ఇలాంటి ఆలోచనతో, మంచి కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించిన దర్శక, నిర్మాతలకు హ్యాట్సాఫ్. ఇలాంటి కొత్త తరహా ఆలోచనలతో ఉన్న సినిమాలను ఇతర భాషలకు ఏమాత్రం తీసిపోకుండా మనమూ తియ్యగలమని ఈ సినిమా కచ్చితంగా నిరూపిస్తుంది. సింగ్ల్ క్యారెక్టర్, సింగిల్ షాట్లో సినిమా తీయడమంటే మామూలు విషయం కాదు. స్క్రిప్ట్ రాసుకున్నంత ఈజీగా దీన్ని సిల్వర్ స్క్రీన్‌పై ఎగ్జిక్యూట్ చేయలేం. అంత కష్టమైన పనిని ఎంతో ప్యాషనేట్‌గా ఎగ్జిక్యూట్ చేసిన దర్శక, నిర్మాతలను చూసి గర్వపడుతున్నాను. హన్సిక అద్భుతంగా నటించింది' అని అన్నారు. 'సింగిల్ షాట్, సింగిల్ క్యారెక్టర్, రీల్ టైమ్ అండ్ రియల్ టైమ్ వంటి తదితర అంశాలు హైలైట్స్‌గా ఉన్న ఈ సినిమా చిత్రీకరణను హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ సమీపంలోని ఓ ఇంట్లో జరిపాం. ఆసక్తికరమైన కాన్సెప్ట్‌తో సాగే ఈ సినిమాలో హన్సిక నటన ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తుంది. అంతేకాదు హన్సిక నటనలోని మరో భిన్న కోణానికి అందరూ ఫిదా అయిపోతారు' అని మేకర్స్ తెలిపారు.