Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గత కొన్ని రోజలుగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ 'మా' ఎన్నికలపై సభ్యుల ఆరోపణలు, ప్రత్యారోపణలతో నానా రచ్చ జరుగుతోంది. ప్రస్తుత అధ్యక్షుడు నరేష్, రాబోయే ఎన్నికల్లో 'మా' అధ్యక్ష పదవికి పోటీ చేయబోతున్న ప్రకాష్‌రాజ్, మంచు విష్ణు తదితరుల మాటల యుద్ధం రోజు రోజుకి శృతిమించడంతో పాటు తాజాగా నటి హేమ ప్రస్తుత అధ్యక్షుడు నరేష్‌పై చేసిన ఆరోపణలు పెద్ద దుమారాన్నే రేపాయి. దీంతో 'మా' ప్రతిష్ట మరింత దిగజారిందని అందరూ బాహాటంగా విమర్శిస్తున్నారు. దీంతో 'మా' ఎన్నికల అంశాన్ని ఓ సక్రమైన మార్గంలో పెట్టేందుకు 'మా' వ్యవస్థాపక అధ్యక్షుడు చిరంజీవి స్వయంగా రంగంలోకి దిగారు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు, వాటి తాలూకా ప్రభావం వంటి తదితర అంశాలన్నింటిని కూలంకషంగా అక్షరబద్ధం చేసి 'మా' క్రమ శిక్షణ సంఘం అధ్యక్షుడు కృష్ణంరాజుకు లేఖ రాశారు.
'మా' ఎన్నికలు వెంటనే జరపాలని, ఎన్నికలు ఆలస్యమైతే సంక్షేమ కార్యక్రమాలు నిలిచిపోతాయని చిరంజీవి లేఖలో పేర్కొన్నారు. సభ్యుల బహిరంగ ప్రకటనలతో 'మా' ప్రతిష్ట మసకబారుతోందని, 'మా' ప్రతిష్ఠ దెబ్బతీస్తున్న ఎవర్నీ ఉపేక్షించవద్దని కష్ణంరాజును చిరంజీవి కోరారు. ప్రస్తుతం ఉన్నది ఆపద్ధర్మ కార్యవర్గమేనని స్పష్టం చేస్తూ ఈ సమస్యను కష్ణంరాజు త్వరగా పరిష్కరిస్తారని ఆశిస్తున్నట్లు చిరంజీవి అభిప్రాయపడ్డారు. కోవిడ్ తదనంతర పరిస్థితుల వల్ల అనేక మంది 'మా' సభ్యులు ఇబ్బందులకు గురి అవుతున్నారని, వారందరిని ఆదుకోవాల్సిన బాధ్యత ఉందని చిరు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలు వెంటనే జరపకపోతే వివాదాలు మరింత ముదిరే అవకాశముందని, దీని వల్ల అత్యంత ప్రతిష్ఠాత్మకమైన 'మా'కు చెడ్డపేరు వస్తుందన్నారు.
'మీరు పరిశ్రమలో పెద్దవారు. మీకు మొదటి నుంచి జరుగుతున్న విషయాలన్నీ తెలుసు. సంస్థ ప్రతిష్టను మసకబారుస్తున్న వారెవ్వరినీ మీరు ఉపేక్షించవద్దు. వారిపై క్రమశిక్షణాచర్యలు తీసుకోండి' అని కృష్ణంరాజుకి లేఖలో చిరు సూచించారు. 'మా'లో ప్రస్తుతం నెలకొన్న వివాదాలు తొలగిపోయి, అందరూ ఒక కుటుంబంలా కలిసి పనిచేసే రోజులు త్వరలోనే వస్తాయనే ఆశాభావాన్ని చిరంజీవి వ్యక్తం చేశారు.