Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'వ్యసన స్వభావం ఉన్న కొంతమంది కథే ''బ్రాందీ డైరీస్'. ఆ వ్యసనం చుట్టు అల్లుకున్న ఒక అందమైన కుటుంబ కథ. నా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు కూడా ఈ సినిమాలో ఉంటాయి. అయితే ఎటువంటి సందేశాలు, లెక్చర్గాని ఉండదు' అని అంటున్నారు దర్శకుడు శివుడు.
కలెక్టివ్ డ్రీమర్స్ పతాకంపై శివుడు రచన, దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. విడుదలకు సిద్ధమైన ఈ చిత్రం గురించి దర్శకుడు శివుడు బుధవారం మీడియాతో మాట్లాడుతూ,'చిన్నప్పట్నుంచి సినిమా అంటే పిచ్చి. అసిస్టెంట్ కమీషనర్ అఫ్ టాక్స్ ఆఫీసర్‌గా పని చేశాను. సినిమా కథలు రాసుకోవటానికి టైమ్ సరిపోవటం లేదని, ఆ ఉద్యోగం మానేసి జూనియర్ హిస్టరీ లెక్చరర్‌గా చేరాను. హిస్టరీ పాఠాలను విద్యార్థులకు సినిమాటిక్‌గా చెప్పేవాడిని. నా జీవితంలోకి కూడా ఆల్కాహాల్ వచ్చింది. బాగా బానిస అయిపోయాను. మళ్ళీ ఇప్పుడిపుడే కోలుకుంటున్నాను. అయితే ఆల్కాహాల్ మంచిదా?, చెడ్డదా అని ఈ సినిమాలో నేను చెప్పలేదు. ఆల్కాహాల్ తాగితే జరిగే పరిణామాల గురించి మాత్రమే చెప్పాను. మా కథకి 'బ్రాందీ డైరీస్' టైటిల్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇందులో అందరూ కొత్తవాళ్లే నటించారు. అలాగే గుంటూరు, పాలకొల్లు, రాజమండ్రి, శ్రీకాకుళం లాంటి ఊళ్లల్లో మంచి ప్రతిభ ఉన్న రంగస్థల నటులున్నారు. వాళ్ళకి ఈ చిత్రం మంచి అవకాశం కల్పించింది. సెన్సార్ వాళ్ళు క్లీన్ ఫిల్మ్ అన్నారు. ఆల్కాహాల్ ఉంది కాబట్టి 'ఎ' సర్టిఫికెట్ ఇచ్చారు. ఈనెల 13న 130 థియేటర్స్‌లో సొంతంగా రిలీజ్ చేస్తున్నాం. కర్నాటకలోనూ 30 థియేటర్లలో విడుదలకు ప్లాన్ చేశాం' అని తెలిపారు.