Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆర్.నారాయణ మూర్తి నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం 'రైతన్న'. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా ఆర్.నారాయణమూర్తి మీడియాతో మాట్లాడుతూ,' ఈనెల 14న మా సినిమాని రెండు తెలుగు రాష్ట్రాలలో రిలీజ్ చేస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు చట్టాలను వెంటనే రద్దు చేయాలనే లక్ష్యంతో ఈ సినిమా తీశాను. భారత దేశంలో సామాజికంగా వెనకబడిన కులం ఏదైనా ఉంది అంటే, అది రైతు కుటుంబమే. రైతే దేశానికి వెన్నెముక. రైతే రాజు...ఆ నానుడి ఏమైంది?, ఆ రైతు ఎక్కడున్నాడు?, అన్నం పెట్టే అన్నదాత ఈ రోజు ఎలాంటి స్థితిలో ఉన్నాడు?, నేటి రైతు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. రైతు తను పండించే పంటకి మార్కెట్లో గిట్టు బాటు ధర రాక, తన అప్పులు తీర్చుకో లేక అనేక ఇబ్బందులు పడుతున్నాడు. కొన్ని పరిస్థితుల్లో గత్యంతరం లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రైతు ఆత్మహత్య చేసుకోకూడదు. అన్నం పెట్టే రైతుకి గిట్టుబాటు ధర కావాలి. డాక్టర్ స్వామి నాథన్ కమిటీ సిఫార్స్లను ఇంప్లిమెంట్ చేస్తూ, కేంద్ర ప్రభుత్వం వాటికి చట్ట బద్ధత కలిపించిన నాడు రైతే రాజు. వ్యవసాయం దండుగ కాదు పండుగనే రోజు రావాలి. అన్నం పెట్టే అన్నదాత సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ తీసిన చిత్రమే మా 'రైతన్న'' అని తెలిపారు.