Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం 'పుష్ప-ది రైజ్'. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రంలోని 'దాక్కో దాక్కో మేక..' అంటూ సాగే ఫస్ట్ సింగిల్‌ని శుక్రవారం చిత్ర బృందం ఐదు భాషల్లో రిలీజ్ చేసింది. ఈ పాట విడుదలైన మరుక్షణం నుంచే అద్భుతమైన స్పందన దక్కించుకోవడం ఓ విశేషమైతే, విడుదలైన గంటల్లోనే 1 మిలియన్ లైక్స్ రావడం మరో విశేషం. ఈ సందర్భంగా అల్లుఅర్జున్ ఆల్ టైమ్ రికార్డ్ అంటూ ఓ పోస్టర్ని సైతం రిలీజ్ చేసింది. 'వెలుతురు తింటది ఆకు.. ఆకును తింటది మేక.. మేకను తింటది పులి.. ఇది కదరా ఆకలి..పులినే తింటది చావు.. చావును తింటది కాలం..కాలాన్ని తింటది ఖాళీ.. ఇది మహా ఆకలి..వేటాడేది ఒకటి.. పరిగెత్తేది ఇంకొకటి.. దొరికిందా ఇది సస్తాది.. దొరక్కపోతే అది సస్తాది..ఒక జీవికి ఆకలేసిందా.. ఇంకో జీవికి ఆయువు మూడిందే..హే దాక్కో దాక్కో మేక.. పులొచ్చి కొరుకొద్దీ పీక..' అంటూ సాగిన ఈ పాటలో అల్లు అర్జున్ మేకోవర్, ఆయన మాస్ లుక్ తీరు హైలైట్‌గా నిలిచింది. నోటిలో కత్తి పెట్టుకుని బన్నీ చేసిన డాన్స్‌కు అభిమానులు, ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. తెలుగులో శివం, హిందీలో విశాల్ దడ్లాని, కన్నడంలో విజరు ప్రకాష్, మలయాళంలో రాహుల్ నంబియార్, తమిళంలో బెన్నీ దయాల్.. వంటి లీడింగ్ సింగర్స్ ఈ పాటను అత్యంత అద్భుతంగా పాడారు. ముత్తంశెట్టి మీడియాతో కలిసి మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న నాయిక. రెండు భాగాలుగా రానున్న ఈ సినిమాని దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్నారు. క్రిస్మస్ కానుకగా 'పుష్ప- ది రైజ్' విడుదల కానుంది' అని చిత్ర బృందం తెలిపింది.