Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విశ్వక్సేన్, నివేద పేతురాజ్, సిమ్రాన్ చౌదరి, మేఘా లేఖ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'పాగల్'. నరేష్ కుప్పిలి దర్శకత్వంలో దిల్‌రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, లక్కీ మీడియా బ్యానర్స్‌పై బెక్కెం వేణుగోపాల్ నిర్మించిన చిత్రమిది. ఇటీవల విడుదలైన ఈ సినిమా విశేష ప్రేక్షకాదరణ పొందుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ఏర్పాటు చేసిన సక్సెస్‌మీట్‌లో హీరోయిన్ నివేద పేతురాజ్ మాట్లాడుతూ, 'ఈ సినిమా విజయం సాధించడం చాలా ఆనందంగా ఉంది. ఇది మాకొక ఎమోషనల్ జర్నీ. హీరో విశ్వక్‌కి మరో విజయం లభించింది' అని చెప్పారు. 'మేమంతా ఎంతో ఇష్టపడి చేసిన సినిమా ఇది. నన్ను నమ్మి ఓటీటీలో కాకుండా ఈ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేసిన దిల్‌రాజుకి థ్యాంక్స్. మేం పెట్టిన ఎఫర్ట్‌కి మంచి ఫలితం లభించింది. ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్' అని నిర్మాత బెక్కెం వేణుగోపాల్ అన్నారు.
హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ, 'ఈ సినిమా విడుదల తరువాత చాలా మంది నేను పేరు ఎప్పుడు మార్చుకుంటానా అని చూస్తున్నారు. కానీ ఈ సినిమా హిట్‌తో నా నమ్మకం నిజమైంది. ఇప్పుడు నేను పేరు మార్చుకోవాలసిన అవసరం లేదు. నా 'హిట్' కలెక్షన్స్ కంటే 'పాగల్' కలెక్షన్స్ 40% ఎక్కువ వచ్చాయి. ఈ సినిమాతో ఆడియెన్స్ తప్ప నాకు ఎవరూ లేరని అర్థం అయింది. నన్ను కాపాడేది వీళ్లే. శని, ఆదివారాల్లో 6.5 కోట్ల గ్రాస్ కొట్టింది సినిమా. సింగిల్ స్క్రీన్స్ ఊగిపోతున్నాయి. ఇంతకంటే ప్రూఫ్ ఏం కావాలి?, నన్ను నమ్మింది మాత్రం ప్రేక్షకులే. వారికి థ్యాంక్స్' అని అన్నారు.