Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీముఖి, మనో, రాజా రవీంద్ర, భరణి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'క్రేజీ అంకుల్స్'. ఈ.సత్తిబాబు దర్శకత్వంలో గుడ్ సినిమా గ్రూప్స్, గ్రీన్ మెట్రో మూవీస్, శ్రీవాస్ 2 క్రియేటివ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈనెల 19న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా మంగళవారం రాజా రవీంద్ర మీడియాతో మాట్లాడుతూ, 'ఇదొక మంచి ఎంటర్టైనింగ్ చిత్రం. ఇలాంటి పాండమిక్ సమయంలో థియేటర్‌కి వచ్చిన ప్రేక్షకుడు రెండు గంటల పాటు హాయిగా నవ్వుకోవడం ఖాయం. సాధారణంగా యాబై ఏళ్లు దాటిన వ్యక్తికి భార్యతో ఎక్కువ అనుబంధం ఉంటుంది. కానీ మనవళ్లు, మనవరాళ్లు వచ్చిన తర్వాత భార్య సరిగ్గా పట్టించుకోకపోతే, ఫేస్బుక్ సహా ఇతర సోషల్ మీడియాల్లో ఎవరో ఒక అమ్మాయితో చాటింగ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇలాంటి చిన్న తప్పు చేసిన కారణంగా హ్యాపీగా ఉండాల్సిన నా జీవితం ఎలాంటి సమస్యల్లో ఇరుక్కుందనేదే కథ. అలాగే మిగిలిన ఇద్దరి (మనో, భరణి) పాత్రలు కూడా ఉంటాయి. ఇందులో నా పాత్ర పేరు రాజుగారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాను. రెడ్డిగారు పాత్ర చేసిన మనో గోల్డ్ షాప్ ఓనర్. రావుగారి పాత్ర చేసిన ధరణి ఫైనాన్స్ బిజినెస్ చేస్తుంటాడు. మేం ముగ్గురం స్నేహితులమే. కానీ ఒకరికి తెలియకుండా మరొకరు, ఒకే అమ్మాయిని లైన్లో పెట్టే ప్రయత్నం చేస్తుంటాం. శ్రీముఖి మంచి యాంకర్, ఎనర్జిటిక్ పర్సన్. ఈ సినిమాలో చాలా బాగా చేసింది. ఈ సినిమాకి అందరితోపాటు ముఖ్యంగా భవిష్యత్తులో జాగ్రత్తగా ఉండాలని యూత్ కూడా కనెక్ట్ అవుతారు. ఇప్పటివరకు ఎన్నో విలన్ పాత్రలు చేశా. వాటిని చాలా ఈజీగా చేసేశా. కానీ కామెడీ చేయడం చాలా కష్టం. పైగా రాజుగారి లాంటి పాత్రలు చేయాలంటే మంచి టైమింగ్ ఉండాలి. 'ఆచార్య'లో ఓ మంచి రోల్ చేశాను. రోజ్ విల్లా, సోహైల్ సినిమాలో హీరోయిన్ తండ్రి పాత్రలో కనిపించబోతున్నాను. వీటితోపాటు మరికొన్ని సినిమాల్లో భిన్న పాత్రలు చేస్తున్నాను' అని చెప్పారు.