Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'మా 'రాజా విక్రమార్క' సినిమాలో మెగాస్టార్ అభిమానులకు ఓ సర్ప్రైజ్ ఉంది. అభిమానులందరూ ఈలలు వేస్తూ, గోల గోల చేసేలా ఉంటుంది. కార్తికేయ అద్భుతంగా నటించారు. ఆయన నటించిన 'ఆర్ఎక్స్100'ని మించి 'రాజా విక్రమార్క' బ్లాక్‌బస్టర్ అవుతుంది' అని అంటున్నారు యువ నిర్మాత '88' రామారెడ్డి. కార్తికేయ కథానాయకుడిగా ఆయన నిర్మిస్తున్న చిత్రం 'రాజా విక్రమార్క'. నిర్మాతగా ఆయనకు తొలి చిత్రమిది. నేడు (శుక్రవారం) ఆయన పుట్టినరోజు.
ఈ సందర్భంగా '88' రామారెడ్డి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే.. 'మాది తూర్పు గోదావరి జిల్లా, బిక్కవోలు మండలంలోని కొంకుదురు గ్రామం. దర్శకులు ఎస్వీ కష్ణారెడ్డిగారిది మా ఊరే. రియల్ ఎస్టేట్, ఇతర వ్యాపారాలు ఉన్నాయి. వ్యాపారాల నుంచి సినిమాల్లోకి రావడానికి కారణం డిస్ట్రిబ్యూటర్ వినోద్ రెడ్డిగారు. ఆయనది కూడా మా ఊరే. ఆయన ద్వారా సినీ రంగంలోకి వచ్చాను. నిర్మాతగా 'రాజా విక్రమార్క' నా తొలి సినిమా. ఈ సినిమా నిర్మించాలని అనుకుంటున్నప్పుడు, వినోద్ రెడ్డి దగ్గరకి 'రాజా విక్రమార్క' కథ వచ్చింది. ఈ కథ నాకూ బాగా నచ్చి, సినిమా చేయాలని ఉందని చెప్పాను. తర్వాత ఆదిరెడ్డిగారితో కలిసి సినిమా స్టార్ట్ చేశా. ఇదొక యాక్షన్ ఎంటర్టైనర్. కార్తికేయ ఎన్ఐఏ అధికారిగా కనిపిస్తారు. సినిమాలో వినోదం, ప్రేమ కూడా ఉంటాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. దర్శకుడు శ్రీ సరిపల్లి కాంప్రమైజ్ కాకుండా తీశాడు. క్వాలిటీ విషయంలో రాజీ పడకూడదని ముందుగా అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువపెట్టి మరీ తీశాం. 'ఆర్ఎక్స్ 100'కు మించి ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అవుతుంది. అక్టోబర్‌లో సినిమాని విడుదల చేయాలని అనుకుంటున్నాం. చిరంజీవిగారంటే నాకెంతో ఇష్టం. మా సినిమాకు ఆయన సినిమా టైటిల్ పెట్టాలని అనుకున్నాం. కథ ప్రకారం కుదరటం ఇంకా సంతోషంగా ఉంది. మా సినిమా ఫంక్షన్‌కి మెగాస్టార్‌ని పిలవాలని అనుకుంటున్నాం. సినిమాలో చిరు అభిమానులకు ఓ సర్ప్రైజ్ ఉంది. అదేంటనేది ప్రస్తుతానికి సస్పెన్స్. అభిమానులు అందరూ ఈలలు వేస్తూ, గోల గోల చేసేలా ఉంటుంది. మూవీ మొఘల్ డి. రామానాయుడుగారు నాకు ఆదర్శం. ఆయనలా సినిమాలు నిర్మించాలి. నా పేరు ముందు ఇంటిపేరులా '88' పెట్టుకోవడం వెనుక కారణం ఏంటి అనేది ఓ నాలుగు సినిమాల తర్వాత చెబుతా. కొత్త కథలతో మంచి సినిమాలు తీయాలనేది నా లక్ష్యం. నాకు యాక్షన్ ఎంటర్టైనర్స్, కమర్షియల్ సినిమాలతో పాటు సస్పెన్స్ థ్రిల్లర్స్ బాగా ఇష్టం. ప్రస్తుతం రెండు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి' అని '88' రామారెడ్డి చెప్పారు.