Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'సినిమాలను థియేటర్లలో విడుదల చేస్తేనే ఎగ్జిబిటర్లకి, డిస్ట్రిబ్యూటర్లకి, నిర్మాతలకు మనుగడ ఉంటుంది. అలా కాదని ఓటీటీల్లో సినిమాలను రిలీజ్ చేస్తే అందరికీ నష్టం' అని తెలంగాణా ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి సునీల్ నారంగ్ అన్నారు. నాని నటించిన 'టక్ జగదీష్' సినిమాని ఓటీటీలో విడుదల చేస్తున్న నేపథ్యంలో శుక్రవారం తెలంగాణా థియేటర్స్ ఓనర్స్ అసోసియేషన్ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా సునీల్ నారంగ్ మాట్లాడుతూ, ''టక్ జగదీష్' నిర్మాతలు వారి సినిమాను ఓటీటీలో విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. సదరు నిర్మాతలకు మేం ఫోన్ చేస్తే, ఆర్థిక ఇబ్బందులు గురించి చెప్పారు. దీని గురించి ఓ కమిటీ వేసి మాట్లాడాలనుకున్నాం. అయితే మేం 'లవ్‌స్టోరీ' సినిమాను సెప్టెంబర్ 10న విడుదల చేయబోతున్నట్లు ఎనౌన్స్ చేశాం. కానీ అదే రోజున వాళ్లు 'టక్‌జగదీష్'ను అమెజాన్‌లో విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇలా జరిగితే, ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్‌కు డబ్బులు కట్టలేడు. అలాగే డిస్ట్రిబ్యూటర్లు ప్రొడ్యూసర్‌కు డబ్బులు కట్టలేడు. చివరకు నిర్మాతలకే డబ్బులు రావు. అందుకే నిర్మాతలను సపోర్ట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం. మేం ఓటీటీలకు వ్యతిరేకం కాదు. పండుగలకు సినిమాలను ఓటీటీల్లో విడుదల చేయకండి' అని చెప్పారు.
వైస్ ప్రెసిడెంట్ శ్రీధర్్ మాట్లాడుతూ, 'నా సినిమాని థియేటర్లలో రిలీజ్ చేయడమే ఇష్టం అని చెప్పిన నాని, ఇప్పుడు నిర్మాతల ఇష్టం అంటున్నారు. థియేటర్స్ బాగుంటేనే నిర్మాతలు బాగుంటారు. ఇలాగే ఉంటే, ఓటీటీ వైపు వెళ్ళే నిర్మాతలకు తగిన సమాధానం చెబుతాం. హీరోయిజం థియేటర్లోనే కనపడుతుంది, ఓటీటీలో కనపడదు' అని అన్నారు.
''బాహుబలి' లాంటి సినిమా ఓటీటీలో రిలీజైతే ఇంత పేరు వచ్చేదా?, ఓటీటీల వల్ల టాలీవుడ్‌కి చాలా నష్టం. మేం నిర్మాతలను అక్టోబర్ వరకు ఆగమని చెప్పాం. ఓటీటీలో కాకుండా థియేటర్స్‌లోనే రిలీజ్ చేయాలని పలుమార్లు విజ్ఞప్తి చేశాం' అని జాయింట్ సెక్రటరీ బాల గోవింద్ రాజ్ అన్నారు. ఈ సమావేశంలో టిఎఫ్‌సీసీ మెంబర్ అనుపమ్ రెడ్డి, థియేటర్ ఓనర్స్ అసోసియేషన్ సెక్రెటరీ విజయేందర్ రెడ్డి, నిర్మాత జెమిని కిరణ్ తదితరులు పాల్గొని ఓటీటీల్లో సినిమాలను రిలీజ్ చేయవద్దని నిర్మాతలను కోరారు.